అసలే ఇది జనారణ్యం
మానవమృగాలు సంచరిస్తాయ్
అశ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా !
అడుగడుగునా కాయం మీద
కామనేత్రాలు నిఘా పెడతాయ్
నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో
ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా
ప్రేమంటూ కక్షగట్టి వేటేయ
మధపుటేనుగలు మాటేస్తాయ్
ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో
నిర్జనతావుల్లో అధనుచూసి
నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు
మేకవన్నెపులులు కాపు కాస్తాయ్
ఉదాసీనం వద్దు జాగ్రత్తగ మసలుకో
బస్సు రైలు రద్దీ ప్రాంతాల్లో
నీ దేహంగాంగాలను తడిమేయ
తోడేళ్ళ వేళ్ళు వెతుకుతుంటాయ్
నిర్లక్ష్యంవద్దు చురుకుగా మెదులుకో
కామలోకంలో నిత్యం
నీ కనురెప్పల మాటున
అగ్ని క్షిపణి దాచుకోవాలే…
నీ గుండె పొరల ఒరల్లో
చురకత్తుల పొదుపుకోవాలే.
నీ దేహపు నరనరాల్లో
ధిక్కార నదులు పారించాలే
నీ పెదాల ప్రతి కదలికలో
చైతన్య అస్త్రాలు మెరువాలే
మొత్తంగా నీ దేహాన్ని
ఆయుధగని చేసుకోవాలే
అవసరమైతే సందించాలే
కాముకుల తుదముట్టించాలే
అపుడే స్త్రీజాతి సదా విరాజిల్లు
(నేటి ఆడపిల్లకు అవ్వ ఎరుకజేసే బతుకు సుద్దులు)
– కోడిగూటి తిరుపతి, 9573939493