కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు కలిసేది ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇయన వి•డియాతో మాట్లాడుతూ..కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని..రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకావాలని యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుందన్నారు. రైతు రుణమాఫీ ఎన్నికల ముందు కేసీఆర్‌కు జ్ఞాపకం వొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అన్నివర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల పేరుతో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలకు ఇండ్లు రావాలంటే కేసీఆర్ పాలన పోవాలన్నారు. వెన్ను పోట్లు, మోసాలు, అవినీతి అక్రమాలకు కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం అంటూ ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. పేపర్ లీకేజితో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలలో నిప్పులు పోశారని విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని..ఎవరి సహాయం లేకుండా కేసీఆర్ స్టీల్ ప్లాంట్ పెడతామని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికారన్నారు. స్టీల్ ప్లాట్ ఏమైందో ఖమ్మం ప్రజలకు సమాధానం చెప్పి బీఆర్‌ఎస్ నాయకులు ఖమ్మం జిల్లాలో వోట్లు అడగాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నారని ఏమైంది పరిహారమని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకరెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.