- ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సబిత
- ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అమ్మాయిలే మళ్లీ సత్తా చాటారు. ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
మే 23న ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా.. ఫలితాలు కాస్తా ఆలస్యంగా విడుదలయ్యాయి. ఈ ఏడాది 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు హాజరవగా.. ఇందులో 2,94,378 మంది పాసవగా.. 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా..2,68,763 మంది పాసవగా.. 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌లో 50,512 మంది పరీక్షలు రాయగా..25,615 మంది ఉత్తీర్ణత సాధించగా.. 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బాలికలు 72.33శాతం, బాలుర 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 75.33శాతం, బాలురు 59.21 శాతం పాసయ్యారు.
కొరోనా కారణంగా రెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కున్నాం
ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశాక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కొరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో బోధన చేశామని, గతేడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్‌లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తామని, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి జలీల్ తదితరులు పాల్గొన్నారు.