- నేడు ఆదిలాబాద్ జిల్లాలో సిఎం రేవంత్ పర్యటన
- మంత్రి సీతక్క పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు..విజయవంతం చేయాలని పిలుపు
- ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోనున్న సిఎం
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని..అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడిరచారు. గురువారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వననానికి సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హావిూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడి అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లక్ష మందితో ఇంద్రవెల్లి సభ జరుగుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు ఇంద్రవెల్లి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి