గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తిగానీ, తాను కావని, రాక్షసపాలన పోవాలంటే గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు కోరారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణచి వేయాలనీ, ఇక్కడ తాను గెలిస్తే, గజ్వేల్ ప్రజలు గెలిచినట్టు..కేసీఆర్ అహంకారం ఓడినట్టవుతుందన్నారు. గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కోరారనీ, కేసీఆర్ అహంకారాన్ని ఓడిరచాలని పిలుపునిచ్చారన్నారు. అయితే గెలిస్తే తాను గెలిచినట్టు కాదని గజ్వేల్ ప్రజలు గెలుస్తారనీ, తాను గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. దిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి నెలనెలా వెళ్లి అక్కడి ప్రజల బాగోగులు పట్టించుకుంటున్నారనీ, కానీ కేసీఆర్ మాత్రం గజ్వేల్‌ను ఎప్పుడు పట్టించుకోలేదన్నారు. గజ్వేల్ ప్రజలను ఎన్నడూ కూడా కేసీఆర్ కలవరన్నారు. ముఖ్యమంత్రి ఎర్రవల్లి వొస్తుంటే ప్రజల్లో ఆందోళ మొదలవుతుందనీ, కేసీఆర్ వొస్తుంటే స్థానికులకు ఉపాధి కూడా కరవవుతుందన్నారు. రోడ్డుపక్కన మక్కలు అమ్ముకునేవారూ ఇబ్బందిపడుతున్నారన్నారు. ఆ పీడ విరగడ కావాలంటే 30 తారీఖున కమలం పువ్వు గుర్తుపై వోటేయాలన్నారు. ఎన్నికలు రావడంతో కేసీఆర్ గజ్వేల్ ప్రజలపై లేని ప్రేమ ఒలకబోస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 80 వేల కోట్లు పెట్టి కడితే ప్రాజెక్టు బీటలు వారిపోతుందన్నారు. వేల వేల కోట్లు తెచ్చి వోట్లు కొనాలని చూస్తున్నారనీ ఆరోపించారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ వందల కోట్లు పంపించి వోట్లు కొల్లగొట్టాలని చూస్తారని, డబ్బు తీసుకొని బిజెపికి వోటేయాలన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే సత్తా ఓటరుకుందని అన్నారు. ఈ యుద్ధం కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్య పంచాయితీ అని, ఇది కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం అన్నారు. పేదల కళ్లలో మట్టి కొట్టిన కేసీఆర్ సర్కారుకు బుద్ధి చెప్పాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టే బాధ్యత బిజెపి తీసుకుంటుంది. కేసీఆర్ వోటమితో ఇంట్లో ముసలోళ్లు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామన్నారు. కుటుంబ పెద్ద చనిపోయినా, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 11 రోజులకే అందిస్తామనీ, రైతుబంధుతో రైతులతో పాటుగా, కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. అంతకు ముందు గజ్వేల్ చేరుకున్న ఈటల పట్టణంలోని పాండవుల చెరువుపై ఉన్న కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయంలో, మహంకాళి దేవాలయం, కొటమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మద్దతుదారులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గాడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్‌రావు, టేకులపల్లి రాంరెడ్డి, యెల్లు రాంరెడ్డి, జశ్వంత్‌రెడ్డి, ధరం గురువారెడ్డి తదితరులు ఉన్నారు.