ఇడి విచారణకు సోనియా గాంధీ హాజరు

  • వెంట వొచ్చిన రాహుల్‌, ‌ప్రియాంకలు
  • కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత
  • మూడు గంటల పాటు విచారించిన అధికారులు
  • సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు

న్యూ దిల్లీ, జూలై 21 : నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరక్టరేట్‌ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి విచారణకు ఆమె సోమవారం మరోసారి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు సోనియా దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయుడు రాహుల్‌ ‌గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీ లాండరింగ్‌ ‌నిరోధక చట్టంలోని క్రిమినల్‌ ‌సెక్షన్ల కింద సోనియా వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేశారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించారు. మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరైనందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.

రాహుల్‌ ‌గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్‌ ‌పార్టీకి నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్‌ ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల మేరకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు.. ఈడీ అనుమతి ఇచ్చింది. అయితే విచారణ గది కాకుండా..మరో గదిలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చింది.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు
సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్‌ ‌వెలుపల, లోపల కూడా సోనియా గాంధీ ప్లకార్డులు పట్టుకొని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్‌ ఎం‌పీలు. మరోవైపు.. విపక్షాలు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘కొన్ని పార్టీల ప్రముఖ నేతలే లక్ష్యంగా ప్రయోగిస్తూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డాయి. మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కక్ష సాధిస్తుంది. ఈడీ ద్వారా ప్రతిపక్షాలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తుంది. భాజపా తీరును ఖండిస్తున్నాం. మోదీ సర్కార్‌ ‌ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమష్టిగా పోరాటం చేస్తాయి’ అని ప్రతిపక్షాలు ప్రకటించాయి. సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో దిల్లీలో భద్రతను పెంచారు పోలీసులు. ఔరంగజేబ్‌ ‌మార్గ్, ‌మోతీలాల్‌ ‌నెహ్రూ మార్గ్, ‌జనపథ్‌ ‌మార్గ్, అక్బర్‌ ‌రోడ్‌లను పూర్తిగా మూసివేశారు.

కాంగ్రెస్‌ ‌కార్యకర్తల నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేసులో జూన్‌ 8‌నే సోనియా తొలుత విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్‌ 2‌న ఆమెకు కొరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం..జూన్‌ 12‌న హాస్పిటల్‌లో చేరారు. కొరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో జూన్‌ 23‌న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే హాజరవుతానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సోనియా తనయుడు, కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీని ఇదే కేసు విషయంలో.. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా అప్పుడు కూడా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page