ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ ప్రాంత పర్యావరణం, వ్యవసాయం, వనరులు, విద్యా, వైద్య వ్యవస్థలూ బాగుంటాయని నమ్మి వుంటారు. ‘నీళ్ళ- నిధులు- నియామకాలు’ తమ ప్రాంతానికి కూడా వర్తిస్తాయని భావించే వుంటారు! సాధించి తెచ్చుకున్న కోయిల్ సాగర్ నీళ్లు తమ పంటచేలను తడిపి సస్యశ్యామలం చేస్తాయనే ఆశతోనే వుండి వుంటారు.

హైదరాబాద్ లోని పటాన్ చెరువు  పారిశ్రామిక ప్రాంతం, అక్కడి తీవ్రమైన భూగర్భ, వాయు, జల కాలుష్యం గుర్తుండే వుంటుంది ప్రతి వొక్కరికీ! ఇదే కాకుండా హైదరాబాద్ నగర శివార్లలోని కాటేదాన్, ఉప్పల్, బాలానగర్ ఇంకా ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో రసాయనిక వ్యర్థాలను ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా వదలటం వల్ల కాలుష్యం అక్కడి భూగర్భ జలాల్లో, సమీప చెరువులలో ఎంతటి అనారోగ్య ప్రమాదాల్ని తెచ్చిపెట్టాయో, ఇప్పటికీ ఆయా ప్రాంతాలలోని నీరు తాగటానికి కానీ, మామూలు వాడకానికి కానీ పనికిరాకుండా ఎంతటి అనర్ధానికి దారితీసిందో అందరికీ తెలిసిన విషయమే! అయినా గానీ వేరే గతిలేక సామాన్య ప్రజలు అవే కలుషితమైన నీళ్లు వాడుకుంటూ అనేక రోగాల పాలవుతున్న విషయం కూడా బహిరంగమే! ఇక్కడ ఒక అంశాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. పదేళ్ళ క్రితం తెలంగాణ పర్యావరణం రక్షించబడాలంటే, కాలుష్యపు పారిశ్రామిక వాడలు పోవాలంటే వలస పాలకుల దోపీడీ పాలన అంతమవ్వాల్సిందే అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రధాన నినాదం చేసింది. మరి ఇప్పుడు స్వరాష్ట్రంలో పర్యావరణ ఆలోచనా విధానాలు ఏమైనా మారాయా? స్వరాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలయితే పర్యావరణ కాలుష్య కారకమైన పరిశ్రమలు సుగంధభరిత ఆరోగ్య ఆవాసాలుగా మారతాయా? ఏమో చూడబోతే పరిస్థితి అలానే వుంది!

తెలంగాణలో అనే కాదు, ఎక్కడయినా గానీ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ఒకరిని చూస్తే ఒకరు చిటపటమంటుంటారు. ఎన్నికల సమయంలో మాటల తూటాలు పేలుతుంటాయి. కానీ విచిత్రంగా కొన్ని ప్రాంతాలలో అన్ని పార్టీల ప్రతినిధులు లోపాయికారీగా తమ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేస్తుంటారు. ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టటానికి, ప్రజల ఆకాంక్షలని నిర్బంధంతో అణిచివేయటానికి చెట్టాపట్టాలేసుకుని మరీ పనిచేస్తారు. నారాయణపేట జిల్లా చిత్తనూర్ లో జరుగుతున్నది కూడా ముమ్మాటికీ ఇదే!

‘జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ & ఇండస్ట్రీస్’ వారు ముందు పండ్లతోటల పెంపకం పేరుతో, ఆ తర్వాత బియ్యం మిల్లు ముసుగులో ఆ తదుపరి బరిబాతలుగా ఇథనాల్ కంపెనీ విశ్వరూపంతో తమ జీవితాల్నే కాదు తమ తర్వాతి తరాల జీవితాలను కూడా శాశ్వతంగా కాలుష్యానికి బొంద పెట్టబోతున్నారన్న విషయం అర్థంకావటానికి చిత్తనూరు గ్రామ పరిసరప్రాంతాల ప్రజలకి ఎక్కువ సమయం పట్టలేదు. దోపిడీ వలస పాలకుల వల్ల తెలంగాణ పర్యావరణానికి తీవ్ర నష్టం వచ్చిందని మాట్లాడిన నేతలే స్వరాష్ట్రంలో అంతకుమించిన పర్యావరణ విధ్వంసానికి స్వయంగా పూనుకుని అబద్ధాల ప్రచారం నిస్సిగ్గుగా చేపడితే ప్రజాస్వామ్యబద్ధంగా తమ గ్రామాలను, సహజ వనరులను కాపాడుకోవటం కోసం ఎక్కే గుమ్మం- దిగే గుమ్మంగా అన్ని వ్యవస్థల తలుపులూ తడుతూ రాతపూర్వక విజ్ఞాపనలు ఇచ్చుకుంటూ వెళ్లారు. తమ గ్రామాలను, జీవితాలను కమ్ముకుంటున్న కాలుష్యాన్ని తరిమికొట్టాలని, అందుకు కారణమైన ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని రెండేళ్ల నుంచీ పోరాడుతున్నారు. శాస్త్రవేత్తల నుంచీ, యూనివర్సిటీ అధ్యాపకుల వరకూ వివిధ ప్రజా సమూహాలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, సామాన్య ప్రజల జీవితాలు ప్రమాదకరంగా మారుతాయని జాతీయ అంతర్జాతీయ సోదాహరణాలతో సహా అధికారులకు వివిధ మాధ్యమాల ద్వారా వివరిస్తూ వెళ్లారు. కానీ, వాటిని పెడచెవిన పెట్టిన అధికారులు తాజాగా ప్రజల మీద రక్తాలు కారేలా పోలీసులతో లాఠీఛార్జీ చేయించారు. తీవ్ర నిర్బంధాన్ని మోపారు. పోరాట నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తమ గ్రామాలను, పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా శాంతియుతంగా గత రెండు సంవత్సరాల నుంచీ పోరాడుతున్న ప్రజల మీద ఎన్నికల సమయంలో పట్టపగలు దుర్మార్గమైన పోలీసు లాఠీచార్జీ జరగటం వెనుక అన్ని రాజకీయ పార్టీల అండాదండా పుష్కలంగా వుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

ఇంతకీ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గొడవ ఏమిటి? ఎందుకు ఇంత సుదీర్ఘంగా, పట్టుదలగా చిత్తనూరు పరిసర గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు? నారాయణపూర్ జిల్లా, మరికల్ మండలం, చిత్తనూర్ గ్రామంలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ & ఇండస్ట్రీస్ పేరుతో ఆసియాలోనే అతి పెద్దదయిన ఫ్యాక్టరీ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే ఫ్యాక్టరీ నిర్మాణం మొదలయిపోయింది. దీనికి మూలం ఏ భిన్నాభిప్రాయాన్నీ లెక్కచేయకుండా, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తమ సన్నిహిత పారిశ్రామిక వర్గాల దోపిడీకి ఉపయోగపడేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న అనేకానేక చట్టాల్లో ‘జీవ ఇంధన విధానం- 22’ కూడా ఒకటి. “ఆహార ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది కాబట్టి (మరి ఆకలిచావులు, పోషకాహార లోపం ఎందుకు పెరుగుతోందో మాత్రం చెప్పరు!?) వాటి మిగులుతో పెట్రోల్ లో కలిపే ఇథనాల్ ని తయారుచేసి (ఇప్పటివరకూ చక్కెర ఫాక్టరీలలో ఇథనాల్ తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీల దగ్గర వచ్చే గాఢమైన మొలాసిస్ వాసన గుర్తుతెచ్చుకోండి! కడుపులో తిప్పుతోందా!?) పెట్రోల్ దిగుమతులు తగ్గించటం ద్వారా కోట్ల ఆదాయాన్ని సంపాదించటమే కాకుండా, తక్కువ ధరకు పెట్రోల్ ని ప్రజలకు అందించటం, దేశాన్ని ఆత్మ నిర్భరతత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లటం” ఈ ‘జీవ ఇంధన విధానం- 22’ అని ప్రకటించింది మన కేంద్రప్రభుత్వం. అంతే, వాటి నిర్మాణంలో రాష్ట్రప్రభుత్వాలు, బ్యాంకులు, బడా పెట్టుబడిదారులూ మేమంటే మేమని పోటీలు పడి ఈ రంగంలోకి దిగిపోయాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసానికి తెరలేచింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఇథనాల్ ఫాక్టరీల నిర్మాణానికి అనుమతులు వచ్చేశాయి. ప్రతిచోటా ఒకటే కథ. విధ్వంసం అవుతున్న సహజ వనరులు, మానవహక్కుల ఉల్లంఘన.

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ ప్రాంత పర్యావరణం, వ్యవసాయం, వనరులు, విద్యా, వైద్య వ్యవస్థలూ బాగుంటాయని నమ్మి వుంటారు. ‘నీళ్ళ- నిధులు- నియామకాలు’ తమ ప్రాంతానికి కూడా వర్తిస్తాయని భావించే వుంటారు! సాధించి తెచ్చుకున్న కోయిల్ సాగర్ నీళ్లు తమ పంటచేలను తడిపి సస్యశ్యామలం చేస్తాయనే ఆశతోనే వుండి వుంటారు. మామూలుగా ఎక్కడైనా పర్యావరణమంటే సామాన్య ప్రజలకు తెలిసిన అర్థం ఏమిటి? పీల్చే గాలి, తాగే నీరు స్వచ్చంగా వుండటం. పంట పండించే నేల సారవంతంగా వుండటం, కాలం తప్పకుండా వర్షాలు కురవటం. కార్తెల ప్రకారం అదును తప్పకుండా పంటలు పండించగలగటం. అడవులు, కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు, వంకలు, నక్షలు, బాటలు మాయమయిపోకుండా వాటి తావుల్లో అవి వుండటం. ప్రకృతి నియమాల ప్రకారం ప్రతి జీవజాలం మనుగడ సాగిస్తూ వుండటం. సగటు గ్రామీణ వ్యవసాయాధారిత ప్రజానీకం విశ్వసించే అంశాలు ఇవి.

కానీ వీటికి పూర్తి భిన్నంగా పర్యావరణ విధ్వంసం అంటే కేవలం ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేటులు, బ్యాగుల వాడకం మాత్రమే అని విశ్వసించి అది మాత్రమే అత్యంత ప్రమాదభరితమైన విషయంగా ప్రచారంలో పెట్టే వ్యవస్థ ఒకటి వుంటుంది.  అభివృద్ధి, ఆధునికత అంటే ఫాషన్లు, మెట్రోలు, ఫ్లై ఓవర్లు, బహుళ అంతస్థుల భవనాలు, భారీ ప్రొజెక్టులు అని వ్యవస్థలన్నిటినీ ‘అభివృద్ధి’ జపంతో పర్యావరణ విధ్వంసం కలిగించే వాటివైపు తమ ప్రాధాన్యాన్ని చూపించే ప్రభుత్వాలు, మాటల్లో మాత్రం వ్యవసాయాన్ని పండుగ చేద్దాం అని నోటిమాటగా చెబుతూ వుంటాయి. నిజంగా, వ్యవసాయాన్ని పండుగ చేయాలనుకున్న ప్రభుత్వాలు నిర్బంధపూరిత చట్టాలు తేవు. పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించే పాలసీలు తయారుచేయవు. అవి రాష్ట్ర ప్రభుత్వాలయినా, కేంద్ర ప్రభుత్వాలయినా సరే! ఆఖరికి ప్రతిపక్ష పార్టీలయినా సరే! ‘మాకేం తెలియదు, మేము శుద్ధపూసలం’ అని చెప్పవచ్చు కాక ఎవరయినా! అసలే తెలంగాణలో ఎన్నికల కాలం ఇది. ఎవరు ఏ నినాదాలతో వస్తున్నారో అర్థంచేసుకోవటం, ప్రశ్నించడం ముఖ్యం.

 

కె. సజయ, సామాజిక విశ్లేషకులు,

స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page