అంతరించిపోతున్న చిందు,యక్షగానం,జంగం కథలు,ఫకీరు వేషం,తోలుబొమ్మలాట,దేవర పెట్టె,ఒగ్గు కథలు,శారద కథలు,జముకు కథలు,పఠం కథలు,గొల్ల సుద్దులు వంటి జానపద కళారూపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ కళారూపాలను భవిష్యత్ తరాలకు అందకుండా చేస్తున్నది.మిద్దె రాములు యక్షగానంను పట్టించుకోలేదు. తెలంగాణ లోని ఆదివాసీల,జానపద కళారూపాలను వారి వాయిద్య పరికరాలను,చిత్తరువులను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సేకరించి భద్రపరచలేక పోయింది.
విధ్వంసానికి ప్రతిరూపం
ఒక జాతి అస్తిత్వం ఆ జాతి సంస్కృతి ద్వారా మాత్రమే ప్రతిబింభిస్తుంది.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం కనుమరుగైపోయిన సందర్భం.ఇక్కడి ప్రజల ఆచారాలు, అలవాట్లు, పండుగలు, సాహిత్యం, కళలు అన్ని నిరాదరణకు గురికాబడ్డాయి. భాష అంటే కృష్ణా,గుంటూరు జిల్లాల భాషే సరైన భాష తప్ప తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష భాషే కాదన్న భావన అప్పటి పాలకులలో ఉండేది.తెలంగాణ ప్రజల భాష ఏ పాఠ్యపుస్తకాలలోను లేదు.ఇక్కడి భాషలో రాసిన రచనలు కూడా నిరాదరణకు గురికాబడ్డాయి.తెలంగాణ ఉద్యమంలో మన భాష అవమానించబడుతుందని తెలంగాణ వచ్చిన తర్వాత మన భాషలోనే పాఠ్యపుస్తకాల రూపకల్పన చేసుకుందామని, మన కళలు,మన ఆచారాలు,మన అలవాట్లు అన్ని కూడా అత్యంత వైభవంగా వెలుగొందేటట్లు చేసుకుందామని అప్పటి ఉద్యమ కాలంలో ఇప్పటి ముఖ్యమంత్రి కూడా అన్నటువంటి సందర్భం.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అనుకున్నంత సాంస్కృతిక వికాసం చెందకపోయినా గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంత వరకు జరిగిందేగాని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో గాని, పత్రికలలోగాని, మీడియాలో గాని వ్యవహరించబడే భాషలో ఏ మాత్రం మార్పు రాలేదు.తెలంగాణ భాషలో పాఠ్యపుస్తకాల రూపకల్పన జరుగలేదు. ప్రజాతంత్ర, వెలుగు, వి6 వంటి అతి తక్కువ పత్రికలలో, ఛానలల్లో మాత్రమే తెలంగాణ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు,పత్రికలు, మీడియాలో తెలంగాణ భాష ఉపయోగించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం పైన ఉంది. స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగతో పాటు బోనాల పండుగను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది.అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ,భాషా సాంస్కృతిక శాఖల ద్వారా మరుగున పడిన ఆయా కవుల రచనలను వెలికిదీసి ప్రచురించి సమాజానికి అందజేసే బాధ్యత ను ఆ రెండు సంస్థలు స్వల్పంగా నే నిర్వహి స్తున్నాయి.
ఇవి పేరుకే సాహిత్య సంస్థలైనప్పటికీ అరకొర నిధులను కేటాయించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేక పోతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాశరథి, కాళోజిల పురస్కారాలని నెలకొల్పి సాహిత్యంలో సుప్రసిద్ధులైన టువంటి కవులకు ప్రతి సంవత్సరం వారి జయంతులనాడు పురస్కారాలను అందించి సత్కరించడం సరియైనదే..కాని తెలంగాణ అస్తిత్వం కోసం పాటుపడిన ఎంతోమంది కవులు, రచయితల రచనలను నేటి సమాజానికి అందించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఉద్యమంలో చాలామంది కవులు తమ రచనల ద్వారా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూపించి తెలంగాణ ప్రజలను చైతన్యపరచి ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడం జరిగింది. అటువంటి కవులను కూడా గుర్తించి తగువిధంగా ఆదరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది.
వేలాది ధూంధాం వేదికల పైన కాలికి గజ్జె కట్టి తమ ఆట ద్వారా పాట ద్వారా ప్రజల ని ఉర్రూతూలూగించిన కళాకారులందరిని గుర్తించాల్సిన అవసరం ఉంది.కొంతమంది కళాకారులను మాత్రం గుర్తించి వారిని సాంస్కృతిక సారధులుగా నియమించడం జరిగింది.చాలామంది కళాకారులు తమను కూడా గుర్తించి ఆదుకోవాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకు న్నప్పటికి వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.
కళాకారులను ఆదుకున్నామని గొప్పగా చెప్పుకోవడమే తప్ప చాలా మంది కళాకారుల కన్నీటిని తుడిచే ప్రయత్నం చేయలేదు. ప్రజా గొంతుకలైన కళాకారులను పక్కన పెట్టి పాలకుల గొంతుకు భజన చేసే కళలను ప్రోత్సాహిస్తున్నారు.ఒక అద్భుతమైన సాంస్కృతిక సారథి భవన నిర్మాణం చేస్తామని కళాకారులు తలెత్తుకునేలా,వారి గౌరవం ప్రతిబించేలా ఆ భవనం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు.కానీ ఇప్పటివరకు ఆ భవన నిర్మాణం జరుగలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికి కూడా సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి ఒక వేదిక కూడా లేని పరిస్థితి. స్వరాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో అద్భుతమైన ఆడిటోరియం ను ఏర్పాటు చేసి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమయ్యేలా చేస్తామని చెప్పినప్పటికీ 9 ఏళ్ల కాలంలో ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. చాలామంది వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. కొంతమంది కళాకారులకు మాత్రమే పెన్షన్లు వస్తున్నాయి. ఇంకా చాలామంది వృద్ధ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.
ముక్కోటి తెలంగాణ ప్రజలను ఏకం చేసి ప్రజలను ముందుకు నడిపించిన గీతం అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ తెలంగాణ ఉద్యమంలో ప్రతి బడిలో, ప్రతి వీధిలో, ప్రతి వేదిక పైన మారుమ్రోగిన పాట ఇది.తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే దానిని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పిన అప్పటి ఉద్యమ నాయకుడిగా చెప్పుకొని కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపాటను గూర్చికనీసం ప్రస్తావించకపో వడం బాధాకరం.ఉద్యమానికి పొడుస్తున్న సూర్యుడి గా పాటను నిలబెట్టిన యుద్ధ నౌక గద్దర్ కు తెలంగాణ స్వరాష్ట్రంలో దక్కిన ఫలితాలు ఏమిటో మనందరికి తెలిసిందే.వలస దోపిడిని ప్రశ్నించి పాటను ప్రతిఘటించే ఆయుధం గా మలిచిన బెల్లి లలిత ను ప్రజా స్మృతి లో నుంచి పాలకులు తొలగించేందుకు చేస్తున్న కుట్రలు తెలిసినవే.ఊరు మనదిరా వాడ మనదిరా అంటూ ఊరూరు విప్లవోధ్యమాని వ్యాపింప చేసిన గూడ అంజన్న గోడును ఈ పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. తెలంగాణ అస్థితత్వ సూచిక వరవరరావు గారి ని కేంద్రం అరెస్ట్ చేసిన సందర్భంలో కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు,ఖండించను లేదు.’కదనాన కుత్తుక లను నుత్తరించిన’ తెలంగాణ గేయాలను అందించిన రావెళ్ళ ను కనీసం గుర్తించని పరిస్థితి మన ముందే కనిపిస్తుంది.తెలంగాణ వైతాళికుడు,నెత్తిన పుస్తకాలను మోస్తూ ఊరూరా వాటిని పంచి గ్రంథాలయోధ్యమాన్ని నిర్మించి ప్రజా చైతన్యాన్ని కూడగట్టిని ప్రజల మనిషి వట్టికోట అళ్వార్ స్వామి పేరు మీద ఒక్క సాహిత్య కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టలేదు. సీమాంధ్ర ఆధిపత్య సంస్కృతి ని బలోపేతం చేసిన, తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని అవహేళన చేసిన సీమాంధ్ర సినీ పరిశ్రమ ప్రముఖులు మరణించినప్పుడు దక్కిన అధికార లాంఛనాలు కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
తెలంగాణ సిని పరిశ్రమ ను గుర్తించకపోగా చరిత్ర ను వక్రీకరించే సీమాంధ్ర సినిమా లకు పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ఫిల్మ్ సిటీ లకు కట్టబెట్టిన తీరు ఈ పాలకులు ఎటువైపో తేటతెల్లం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి పుత్ర రత్నం,తలసానీలు ఆధిపత్య సిని పరిశ్రమ కోసం తెలంగాణ వనరులను, ఆత్మ గౌరవాన్ని సమైక్య వాదుల పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారు.చాలామంది కవులను, కళాకారులను పక్కన పెట్టి తమకు ఎవరైతే భజన చేస్తారో అటువంటి వారిని మాత్రమే దగ్గరికి చేరదీసి అందలాలెక్కించడం జరిగింది తప్ప నిజమైన ఉద్యమకారులను, కవులను, కళాకారులను విస్మరించడం దురదృష్టకరం.వందలాది కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో సాధించినది శూన్యం.ఇంత పెద్ద సభలలో భాషా సంస్కృతి కి ఏ మాత్రం ప్రయోజనం జరగకపోగా కనీసం తీర్మానాలు కూడా చేయకపోవడం దురదృష్టకరం.అట్టహాసంగా నిర్వహించిన ఈ సభలలో తెలంగాణ భాషకు పట్టం దక్కకపోగా పెద్ద ఎత్తున భూస్వామ్య సంస్కృతి ని పెంచి పోషించాయి.ఈ పాలకులకు వోటర్లను ఆకర్షించే భాష తెలుసు తప్ప భాష ఆత్మ గౌరవం, సాహిత్య కళారంగాల పట్ల కనీస గౌరవం కూడా లేదు.జాన పద,సంగీత అకాడమీ లు స్థాపిస్తామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం కనీసం దానిని దృష్టిలో పెట్టుకోలేదు.
అంతరించిపోతున్న చింధు, యక్షగానం, జంగం కథలు, ఫకీరు వేషం, తోలుబొమ్మలాట, దేవర పెట్టె,ఒగ్గు కథలు,శారద కథలు,జముకు కథలు,పఠం కథలు, గొల్ల సుద్దులు వంటి జానపద కళారూపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ కళారూపాలను భవిష్యత్ తరాలకు అందకుండా చేస్తున్నది.మిద్దె రాములు యక్షగానంను పట్టించుకోలేదు. తెలంగాణ లోని ఆదివాసీల,జానపద కళారూపాలను వారి వాయిద్య పరికరాలను,చిత్తరువులను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సేకరించి భద్రపరచలేక పోయింది.ఈ బృహత్తర ప్రణాళికను రాజ్యమో, ప్రభుత్వమే, ఓ విశ్వవిద్యాలయమో చేపట్టాల్సిన పనిని అవి ఆ బాధ్యతల నుండి వైదొలిగితే ఒక వ్యక్తిగా ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,తన జీవిత కాలాన్ని వెచ్చించి వేలాదిగా సేకరించిన కళాఖండాలకు కనీసం నిలువ నీడ కల్పించాలని పదే,పదే విన్నవించు కున్నప్పటికి అది అరణ్య రోదనగానే మిగిలి పోయింది. కానీ తాను మాత్రం సాలార్ జంగ్ మ్యూజియం నుంచి పారిస్ దాకా తెలంగాణ రంగుల కళలతో పాటు తెలంగాణ ఆది ధ్వనిని ప్రతిధ్వనింపచేసిండు. చిందు, యక్షగానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చిందు ఎల్లవ్వ రష్యా వినువీధులదాకా పరివ్యాప్తం చేయగలిగింది.కాని ఈ కళారూపాలపై స్వరాష్ట్రంలో పాలకుల తమ చూపును కనబర్చడంలేదు. అంతర్జాతీయ శిల్పి చిత్రకారుడు పిటి రెడ్డి సేవలను తెలంగాణ భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేయలేదు.. కాపు రాజయ్య బాతిక్ చిత్రకారుడు బాలయ్య లు చేసిన కళా రంగంలో చేసిన ఇతోదికమైన కృషిని తన రాజకీయ ప్రత్యర్థుల సిద్ధాంతానికి చెందిన వారిగా గుర్తించి గౌరవించని స్థితి. అంతర్జాతీయ శిల్పి, ఆర్కిటెక్టు ఎక్క యాదగిరి రావు సేవలను తెలంగాణ అమరుల స్మృతి నిర్మాణంలో(మలి దశ) కనీసం వినియోగించుకోలేదు. ఆయన సలహాలను సూచనలను కూడా తీసుకోలేదు. ఆయనకు గౌరవం కూడా ఇవ్వలేదు.కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రకళ విశిష్టతకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండే, తెలంగాణ తల్లి రూప నిర్మాణంలోనూ ఆయన అందించిన శిల్ప లక్షణాలను పొందుపరచవలసి ఉంది.కానీ ముఖ్యమంత్రి తనకు తానే 24 ప్రేమ్ ల స్వయం ప్రకటిత నిపుణునిగా మారిపోతున్నాడు.
తెలంగాణ భాషా నిఘంటువు ఇంతవరకు రుపొందించబడలేదు.తెలంగాణలోని ఆయా ప్రాంతాల మాండలికాలు ఇంతవరకు ప్రభుత్వం చే రికార్డు చేయబడలేదు.ఈ విషయంలో ఆచార్య రవ్వా శ్రీహరి గారు చేసిన దాంట్లో ఈ ప్రభుత్వం రవ్వంతయిన ప్రయత్నించి ఉంటే బాగుండేది.కర్ణాటక భాషా సాహిత్యం ఈ మధ్య కాలంలో దేశ వాసుల మనసు దోచుకొని అనేక భాషలలోకి అనువాదం అవుతున్నాయి.కాని తెలంగాణ భాషా సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించే పరిస్థితి కనబడటం లేదు.ఈ బాధ్యతలని మోయవలిసిన తెలంగాణ సాహిత్య అకాడమి ముఖ్యమంత్రి ని మరియు ఆయన వందిమాగధులను నిరంతరం పొగుడుతూ ‘తెలంగాణ సాహిత్య అగాధమి’ గా మారిపోయింది.తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా వరంగల్ ను రూపొందిస్తామన్న ముఖ్యమంత్రి గారు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.కాళోజి కళాక్షేత్రం ఏ పరిస్థితుల్లో ఉందో మనందరికి తెలిసిందే.గిరిజన యూనివర్సిటీ కేంద్రంగా ఆదివాసీ కళా అధ్యయన కేంద్రం గా చేస్తామన్న హామి,,తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం పై అధ్యయన కేంద్రాన్ని నల్లగొండ యూనివర్సిటీ కేంద్రంగా చేస్తామన్న హామి నీటి మూటగా మారింది. ఇన్ని దుష్పరిణామాలకు కారకులైన ఈ పాలకులు తెలంగాణ అమరుల కోసం నిర్మించిన స్మృతి వనంలోను తెలంగాణ నిర్మాణ కౌశలం లేకుండా చేశారు. రాచరిక వైభోగాలు, భూస్వామ్య పెత్తందారీ పోకడలతో తాను చెప్పినదే సంస్కృతి,ఆచారం అని ప్రజల పై సాంస్కృతిక ఆధిపత్య అజమాయిషీ చెలాయిస్తున్నారు.ఈ పరిస్థితులను ప్రజలంతా ముక్త కంఠంతో ఎదురించకపోతే తెలంగాణ తన సాంస్కృతిక మూలాలను కోల్పోయే ప్రమాదం ఉంది.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, 9441661192