ఇళ్లకు ‘పట్టా’భిషేకం

  • పేదలకు క్రమబద్ధీకరణ ఇంటి స్థల పట్టాలు
  • పట్టాతో మీ ఇళ్లపై మీకు పూర్తి భరోసా, ధీమా, యాజమాన్య హక్కు
  • అర్హులైన 170 లబ్ధిదారులకు పట్టా పత్రాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 27 : ఇళ్లు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు శాశ్వత పట్టా లభించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఏలాంటి హక్కులు లేకుండా అనధికారికంగా నివాసం ఉంటున్న వారికి భరోసా, ధీమా, భద్రత కల్పించాలన్నదే తన తాపత్రయం అని రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న 170 మంది అర్హులైన లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ చేసిన పట్టా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కబ్జాలో ఉన్న ఇంట్లో.. ఉంటున్నామన్న మీలోని భావనను తొలగించి, అభద్రత భావంలో ఉండకుండా..మీరు ఆత్మ విశ్వాసంతో జీవించేలా.. ప్రభుత్వం తరపున యాజమాన్య హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల వాసులు ఆందోళన చెంది ఏ ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం లేకుండా తామే దగ్గరుండి, మీకు కావాల్సిన క్రమబద్ధీకరణ పట్టాలు మీకు ఇప్పించేలా చొరవ చూపామని, మీకు భద్రత, భరోసా, ధీమా కల్పించాలన్నదే తన తపనగా మంత్రి తెలియజేశారు. పట్టాతో పాటు ఇంటి నెంబరు, నల్లా కనెక్షన్‌, ‌కరెంటు మీటరు పత్రాలు కూడా అందిస్తున్నట్లు వివరించారు.

ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో, ఇంటి పరిసర ప్రాంతాలలో దోమల నీటి నిల్వలు లేకుండా చూడాలని, ఇంట్లో అనవసరమైన పాత సామగ్రి ఉండకుండా చూడాలని, దీంతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యుడు పాల సాయిరాం, సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొండం సంపత్‌ ‌రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ ‌బర్ల మల్లిఖార్జున్‌, ‌తహశీల్దార్‌ ‌విజయ్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page