హైదరాబాద్, జూన్ 8 : ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నానక్‌రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని నివాసానికి తరలించారు.
1936, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీ రావు జన్మించారు. బాల్యం నుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన రామోజీ .. తెలుగునాట ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్దదైన ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఆదివారం అంత్యక్రియలు
రామోజీ రావు అంత్యక్రియలు రేపు (ఆదివారం) ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఫిలింసిటీలో జరగనున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఫిలింసిటీకి పలువురు ప్రముఖులు వచ్చి సంతాపం ప్రకటిస్తున్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకుని కంటతడి పెట్టారు.