ఈ ‌నెల 30న పాలమూరుకు ప్రధాన మంత్రి మోదీ

సార్వత్రిక ఎన్నికలకు మోదీ శంఖారావం
విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌ ‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌మహబూబ్‌నగర్‌ ‌పట్టణానికి ఈనెల 30వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్‌ ‌రెడ్డిలు తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో, ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…విశ్వ గురువు ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ  ఈ నెల 30న మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో జరగబోయే బహిరంగ సభకు హాజరవుతారని, సభను రాబోవు సార్వత్రిక ఎన్నికల శంఖరావంగా భావించాలని వారు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో, భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇటీవల చంద్రయాన్‌-3, ‌జి 20 సమావేశాలు, నూతన పార్లమెంట్‌ ‌భవనంలో 33 శాతం మహిళ రిజర్వేషన్‌ ‌బిల్లు ఆమోదం లాంటి విజయాల అనంతరం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రానికి వొస్తున్న ప్రధానమంత్రి మోదీకి యావత్‌ ‌రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

దశాబ్ద కాలంలో మోదీ పాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మోదీ పథకాలు అద్భుతంగా అమలయ్యాయని, యావత్‌ ‌ప్రపంచం మోదీ పాలన  వైపు చూస్తున్నదని, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర భాగంపై నిలిపేందుకు ప్రధానమంత్రి మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. విదేశాల్లో రోడ్లను తలపించే విధంగా భారతదేశంలో, జాతీయ రహదారుల సుందరీకరణ పనులను చేపట్టారన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ, అన్ని వర్గాల వారిని కలుపుకోబోతూ ప్రధానమంత్రి మోదీ ముందుకు సాగుతున్నారని వారు తెలిపారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో 30న జరగబోయే బహిరంగ సభకు క్షేత్రస్థాయి నుండి ప్రజలు బ్రహ్మ రథం పట్టి విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు ప్రజలను మోసగించేందుకు కుట్రలు చేస్తున్నారని, వారిని ప్రజలు నమ్మరాదని తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే అవినీతి పార్టీ అని ఇదివరకే పేరు పడిందన్నారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండు దఫాలుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారన్నారు.

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అంటే కుటుంబ పార్టీగా, నిరంకుశత్వపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తికాకుండానే ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేవలం 145 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఒక మోటార్‌ను ప్రారంభించి డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభ హంగు ఆర్భాటాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రారంభించిన పంపు ద్వారా నీటిని 10 కిలోమీటర్ల మేరకు కూడా వదలకుండా మొదటి రోజు తోనే ఆగిపోయిందన్నారు . రైతులను, ప్రజలను సీఎం కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరు గ్యారెంటీ సూత్రాలు సాధ్యం కానీ హామీలని, ఓ దగా పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీ అని వారు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే  రవీంద్రనాథ్‌ ‌రెడ్డి, మాజీ బీసీ కమిషన్‌ ‌సభ్యులు తల్లోజ్‌ ఆచారి, భాజపా నాయకులు పద్మజా రెడ్డి, జలంధర్‌ ‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page