ఈ మనిషి ఆ మనిషికి లేనట్టేనా?

ఈ క్షణం ఆఖరిది.
ఇక  ముఖాన్ని కనిపించకుండా
మూటకట్టి
మట్టికి కబురు పంపే తుది ఘట్టం.

కొద్ది గంటల్లో భౌతిక రూపం కూడా
పంచభూతల్లో కలసి
గొప్ప జ్ఞాపకంగా మాత్రమే మిగిలే సమయం.

ఇప్పుడు హాజరు కాకపోతే
ఈ మనిషి ఆ మనిషికి లేనట్టే..
తరువాత పుట్టే
ఓదార్పులాంటి పలకరింపులు
ఆ ఆత్మకు చేరవు.

సుదీర్ఘమైన జీవితం ఆరిపోయి
ఆ కుటుంబంలో  చీకటి మాట్లాడుతుంది.
మనసారా వింటే కొన్ని వినిపిస్తాయి….
మరికొందరికి కనిపిస్తాయి కూడా.

వస్తువులా విరిగి, పగిలినవాడు కాదు మనిషి.
ఓ అతీతమైన జీవశక్తి
బలీయమైన మానవ సంబంధాల మధ్య జీవితాన్ని ఇష్టంగా, కష్టంగా,
బరువుగా, తేలిగ్గా గడిపి
చివరకు అన్నిటినీ.అందరికీ పంచి
సెలవు ప్రకటించి సుదూరాలకి వెళ్ళేవాడు.

ఊపిరి గురించి ఆలోచన కాదిప్పుడు
కన్నీటి బిందువులతో నడిచే
అంతిమ వాక్యం ముఖ్యం.
జ్ఞాపకాలతో కృతజ్ఞత చెల్లించే
చివరి చూపుతో చెల్లించే స్పర్శ కీలకం.

నెమరువేసుకునే  తలపులలో
తళుక్కుమని  మెరిసే మాటలు
శాశ్వతాన్ని పెంచుతాయి.
పలువురిలో ఊరేగుతాయి.

ఆఖరి మజిలీ ముగిసి ఆగిన ఆటలో
నీ పాత్రను తలచుకునే సందర్భంలో
ఆత్మకు శాంతి చేకూరాలని
ఘటించే అంజలి ఘనమైన కీర్తికి సాక్ష్యం.

కొన్ని బంధాలు,  భేదాలు గుమికూడి
నిర్జీవ ముఖంలో  నిన్నటి ఆఖరి పలుకులో
అర్దం తవ్వి తమకు తాము తడుముకుని
తలచుకోవడం కనీస మర్యాద.

అంతటా అన్నింటా అందరినీ విడచి
ఆ దేహం ఊరేగుతూ
సాగే అంతిమ యాత్రలో
పోతూ పోతూ ఏదో చెబుతూనే ఉంటాడు.

ముఖపరిచయం కలిగిన
మాట మనసు తెలిసిన ప్రతి వాడు
ఎక్కడో ఎప్పుడో ఋణపడే ఉంటాడు.
నేటి చివరి చూపుతో ఆ ఋణం తీరినట్లే.

ఆ జీవుడు చేసిన మంచికి
తలవంచి నమస్కరించే సంస్కారం
ఈ దేశం ఎప్పటి నుండో నేర్పిన గొప్ప విలువ.
దానికి మద్దతు పలికే నిబద్ధతే
దివికేగిన ఆ మనిషికి ఘన నివాళి.

… చందలూరి నారాయణరావు
         9704437247 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page