ఈ మరణాలకు కారకులెవరు..?

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి విధుల్లో ఉన్న పద్నాలుగు మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. ఇవి తక్షణ ప్రభావాలు మాత్రమే. భవిష్యత్తులో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర కార్మికుల మీద దీని ప్రభావాలు కనిపించొచ్చు. ప్రమాదాలు జరిగిన వారం పది రోజులు ప్రజలలో హంగామా ఉంటుంది. తరువాత షరా మామూలే ! అలా కాకుండా ప్రమాదాలు ఎదుర్కోడానికి పటిష్టమైన చర్యలు పరిశ్రమ యాజమాన్యం తీసుకోవాలి. సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి.

 

మమ అన్న రీతిలో తనిఖీలు చేస్తే ఇటువంటి ప్రమాదాలే సంభవిస్తాయి. ఇదేమి దేశంలో మొదటి ప్రమాదం కాదు. ఇంతకు ముందు ఎన్నో జరిగాయి. భోపాల్‌ గ్యాస్‌ ( మిథైల్‌ ఐసో సైనైడ్‌  ) ఉదంతం జరిగి చాలా రోజులైనా కూడా ఇప్పటికీ అప్పటి కార్మికులమీద ఆ వాయు ప్రభావం చూపుతుంది. ఇక్కడ కేవలం ప్రభుత్వాలను తప్పు పట్టలేం. ఎందుకంటే ప్రభుత్వాలకు అనేక బాధ్యతలు ఉంటాయి. సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలదే తప్పు. ప్రమాదల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి. ప్రమాదాలు కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తాయి.

ఈ ప్రదేశాలలో ముప్పు ఎక్కువ: అధిక శబ్ధం, వైబ్రేషన్లు, రేడియేషన్లు, విద్యుత్‌ పరికరాలు, బాయిలర్ల వద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశాలెక్కువ. అధిక శబ్దం కార్మికుల వినికిడిని దెబ్బతీస్తుంది. పనిచేసే వారి కమ్యూనికేషన్‌కు ఆటంకం కలిగించడంతో పాటు హెచ్చరికలను వినడం కష్టతరం చేస్తాయి. చేసే పనిపై ఏకాగ్రతను భంగం కలిగిస్తాయి. కార్మికుల అలసటను పెంచుతాయి. ఒత్తిడి, చిరాకు,నిద్ర రుగ్మతలకు కారణమవుతాయి. పనితీరును తగ్గిస్తాయి. వైబ్రేటింగ్‌ ఉన్న ఉపరితలంపై పనిచేసేటప్పుడు ఈ కంపనాలు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీర్ఘకాలం గురైతే చేతులుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. శక్తి ఉత్పత్తి, ఔషధాల తయారీ, పరిశోధన వంటి పరిశ్రమలలో అయోనైజింగ్‌ రేడియేషన్‌ శరీర కణంలోని డిఎన్‌ఎలో రసాయన మార్పులను ఉత్పత్తి చేయడం ద్వారా శరీర కణాలపై దాడిచేసి క్యాన్సర్‌ రావొచ్చు. తీవ్రమైన శీతల వాతావరణం కూడా కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ప్రపంచవ్యాప్త మరణాలు: అంతర్జాతీయ కార్మికసంస్థ తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలోని పరిశ్రమల్లో అపరిశుభ్ర వాతావరణం  కార్మికుల భద్రత ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. మొత్తం 340 కోట్ల ప్రపంచ శ్రామికశక్తిలో 241కోట్ల కార్మికులు అధిక వేడికి గురవుతున్నారు. 18.97 వేల మంది పని సంబంధిత మరణాలుకు, 20.9 లక్షల మంది  ఆయుర్దాయం తగ్గడానికి, 2.62 కోట్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిబారిన పడడానికి అధిక వేడి కారణం. 160 కోట్ల కార్మికులు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురై చర్మ క్యాన్సర్‌తో ఏటా పంతొమ్మిది వేలకు పైగా పారిశ్రామిక శ్రామికులు మరణిస్తున్నారు. వాయు కాలుష్యానికి గురగుచున్న కార్మికులలో యేటా 8.60 లక్షల మంది చనిపోతున్నారు. పెస్టిసైడ్స్‌ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులలో ఏటా మూడులక్షల కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతిని నిరాశ ఆందోళన కారణంగా ప్రతి సంవత్సరం పన్నెండు వందల కోట్ల పని దినాలు వృధా అవుతున్నాయని తెలిపింది.

తగు జాగ్రత్తలు తీసుకోవాలి: పరిశ్రమలలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. పనిచేసే వారి ఆరోగ్యానికి, భద్రతకు, ప్రమాదాలు జరగకుండా నిర్దిష్ట నివారణ చర్యలు తీసుకోనే బాధ్యత వందశాతం యాజమాన్యాలదే. తనిఖీలు చేయించడం ప్రభుత్వాల బాధ్యత. పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర చట్టాలకు ప్రమాణాలకు అనుగుణంగా  కార్మికులను, ప్రజలను పర్యావరణాన్ని రక్షించడానికి అవసరమైన భద్రతాచర్యలు తీసుకోవాలి. రసాయన ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించడానికి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్పాదక ప్రక్రియ వ్యర్థాలును శుద్ధిచేసి హానిలేని కారకాలుగా మార్చడం, పారవేయడం లాంటి సమర్థవంతమైన యేర్పాట్లు చేయడం ప్రతీ పరిశ్రమ విధి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు దుమ్ము, పొగ బయటకు పోయేటట్లు, గాలిలో అనుకూలమైన తేమ ఉండేటట్లు చూడాలి.

 

ప్రమాదకరమైన పొగలు, వాయువులు లీకైతే ప్రమాదం జరగకుండా రక్షణ వ్యవస్థ ఉండాలి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు పనిచేసేవారు సురక్షితంగా తప్పించుకునే మార్గాలు, మంటలను ఆర్పడానికి అవసరమైన పరికరాలు ఉండాలి. అధిక ఉష్ణోగ్రతకు తట్టుకునే వస్త్రాలను, కళ్లకు రక్షణ  కలిగించే పరికరాలను కార్మికులకు అందించాలి. ప్రతీ పరిశ్రమ కార్మికుల ఆరోగ్య సంరక్షణకు వైద్యున్ని నియమించుకోవాలి. కార్మికులకు తగు శిక్షణ ఇవ్వాలి. ప్రమాదాలు జరిగిన తరువాత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌ గ్రేషియా సంబంధిత పరిశ్రమల లాభాల నుండి ఇప్పించాలి. నైపుణ్యం లేని వారిని, పిల్లలను పనిలో పెట్టుకోగూడదు. ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలి.

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page