‘‘అప్పట్లో నిజామ్ కిరాయి సైన్యం రజాకార్లను ఎదిరించి ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో హిందువులే కాదు, మహమ్మదీయులు ఇతర మతస్థుల వారూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని, హైదరాబాద్ విముక్తిని హిందూ మెజారిటీని తనవైపు ఆకర్షించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో రాజకీయ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలు తాము నిర్వహిస్తే ఎక్కడ ముస్లిమ్ మైనారిటీలకు కోపం వస్తుందోననే భయ సందేహాల మధ్య కొట్టు మిట్టాడడం కూడా స్పష్టంగానే కనిపిస్తున్నది.’’
– దేవులపల్లి అమర్
హైదరాబాద్ సంస్థానం నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకోవలసిన మహత్తర ఉత్సవాలకు రాష్ట్ర రాజధానిలో వేర్వేరు రాజకీయ కుంపట్లు వెలిసాయి. హైదరాబాద్ విముక్తి చెందింది మావల్లనే అంటే మా వల్లనే అనే స్థాయికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేరు కున్నాయి. ఒక రాజకీయ పార్టీ దీని నుంచి లాభం పొందడానికి ప్రయత్ని స్తుంటే మరో రాజకీయ పార్టీ ఏం చేస్తే ఏ వర్గం బాధపడుతుందో అన్న పద్ధతి లో అంటీముట్టనట్టు ఉత్సవాల నిర్వహణను తలపెట్టింది. మరో జాతీయ పార్టీకి ఇదో మొక్కుబడి వ్యవహారం వలె కనిపిస్తున్నది. హైదరాబాద్ విముక్తి నిజంగా జరిగిందా? ఆ విముక్తి ఫలాలు హైదరాబాద్ సంస్థానం క్రింద ఉండిన ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా అత్యధిక ప్రాంతమైన తెలంగాణకు అందినవా లేదా అన్న ప్రశ్న ఎట్లా ఉన్నా ప్రస్తుతం జరుగుతున్న వేడుకలు మాత్రం రాజకీయ అవసరాలను ప్రతిబింబించేవిగానే కనిపిస్తున్నాయి. అందరి కంటే ముందు హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాలు జరపదలిచినట్టు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఆ తరువాత కొద్ది రోజులకు హడావుడిగా మేల్కొన్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ విముక్తి వల్ల వొనగూడిన రాజకీయ అధికార ఫలాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం చివరి నిముషం వరకు సందిగ్దావస్థలో ఉండి ఎట్టకేలకు మేల్కొని ప్రభుత్వ లాంఛనాన్ని ప్రకటించింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవలే వరంగల్‌లో ముగిసిన రాష్ట్ర మహాసభలలో తీర్మానించినా మద్రాస్ లో జరుగుతున్న తన పార్టీ జాతీయ మహాసభల కారణంగా వాటిని వాయిదా వేసుకున్నది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్సవాలను ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసిన శక్తులు ఆ పని మతం ప్రాతిపదికన చెయ్యలేదని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ్య పూర్వకంగానే మరిచిపోయిన ట్టున్నాయి. అప్పట్లో నిజామ్ కిరాయి సైన్యం రజాకార్లను ఎదిరించి ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో హిందువులే కాదు, మహమ్మదీయులు ఇతర మత స్థుల వారూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని, హైదరాబాద్ విముక్తిని హిందూ మెజారిటీని తనవైపు ఆకర్షించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో రాజకీయ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలు తాము నిర్వహిస్తే ఎక్కడ ముస్లిమ్ మైనారిటీలకు కోపం వస్తుందోననే భయ సందేహాల మధ్య కొట్టు మిట్టాడడం కూడా స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారం చవిచూడని – భార తీయ జనతాపార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను తన వైపు తిప్పుకోడానికి – ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎట్లా అయితే ఉపయోగించుకోదలిచిందో ఇప్పుడు హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాలను కూడా అదే కార్యక్రమానికి ఉపయోగించు కోజూస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇక ఇటీవల కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మద్దతు నివ్వడం ద్వారా ముస్లిమ్ లను దూరం చేసుకున్నానని భావిస్తున్న అధికార తెలుగుదేశం ఉత్సవాల నిర్వహణకు ఎంతో తటపటాయించింది. చిత్రమైన ఘర్షణ. కేంద్రంలో ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ. ఇక్కడి కొచ్చే సరికి కుస్తీ. 17వ తేదీన హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించే సమస్యే లేదని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ రోజున సెలవు ఇచ్చి తీరాల్సిందేనని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. దాని వల్ల సెలవు సాధించుకోలేక పోయినా రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలకు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటున్న తృప్తి మాత్రం మిగిలింది. ఇక హైదరాబాద్ సంస్థానం విమోచన కోసం జరిగిన పోరాటంలో ఆనాడు కీలకమైన పాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వైఖరి చిత్రంగా ఉన్నది.
హైదరాబాద్ సంస్థానం విమోచన పొందిందా, భారతదేశంలో విలీనం అయిందా అన్నది కాంగ్రెస్ నాయకుల మేధస్సుకు అందనట్టు కనిపిస్తున్నది. ఎందరో కాంగ్రెస్ నాయకులు ఆనాడు నిజామ్ కు వ్యతిరేకంగా పోరాడినారు. స్వామి రామానందతీర్థ మొదలుకుని ఇప్పటికింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న పి.వి. నరసింహారావు గారి వరకూ ఈ పోరాటంలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా రామానందతీర్థ స్మారక ట్రస్ట్ అధ్యర్యంలో దాని అధ్యక్షుడిగా మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఏడాది పొడుగునా హైదరాబాద్ విమోచన ఉత్సవాలను నిర్వహించి తెలంగాణ ప్రాంతపు గ్రామీణాభివృద్ధికి కార్యాచరణను నిర్ణయించుకుంటామని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పి.వి. నరసింహారావు ఐదు రోజుల పాటు తెలంగాణ జిల్లాలలోని పలు ప్రాంతాలు పర్యటించి అక్కడి స్వాతంత్య్ర సమరయోధుల సభలలో ప్రసంగించారు. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కమిటి మాత్రం దీనిని విమోచన అనడానికి వీలులేదు. విలీనం అనాలని చెబుతున్నది. అందుకే ఆ కమిటిని హైదరాబాద్ రాజ్య విలీన స్వర్ణోత్సవ నిర్వహణ కమిటిగా పేర్కొన్నది.
హైదరాబాద్ సంస్థానం నిజామ్ రాజు నిరంకుశ పాలన నుంచి విమోచన జరగకుండా ఇండియన్ యూనియన్‌లో విలీనం ఎట్లా జరిగిందో ఈ వాదన ముందుకు తెస్తున్న నాయకులకే తెలియాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి అని చివరన రాసుకోవడం మరవకుండా ఈ ఉత్సవాల నిర్వహణపై కాంగ్రెస్ కమిటి విడుదల చేసిన ఒక కరపత్రం నిండా నిజామ్ పరిపాలనకు వ్యతిరేక పోరాట నేపధ్యాన్ని ఆనాటి స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థ మొదలుకొని ఎంతమంది ఏర్పరచింది రాసుకున్నారు. ఆనాటి పోరాటాలలో త్యాగాలు చేసిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ పోరాటాలూ, త్యాగాలు కేవలం విలీనం కోసమే జరిగాయా? తెలంగాణ ప్రజలను నిజామ్ దుష్టపాలన నుంచి తప్పించి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయడం కోసం జరిగాయా? ఈ పోరాటాలన్నీ లెక్కలోనివే కాదు ‘సర్దార్ పటేల్ సైన్యాన్ని నడిపించగానే జడిసిపోయిన నిజామ్ హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనానికి ఇచ్చేసాడని భావించే వాళ్లే ఇట్లా మాట్లాడతారు. లేదా హైదరాబాద్ సంస్థానం ఇప్పటికింకా విమోచనకే నోచుకోలేదు. ఈ ప్రాంతం మీద అధికారం, పెత్తనం నిజామ్ రాజు నుంచి ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు బదిలీ అయింది అని విశ్వసించే వాళ్లయినా ఇట్లా మాట్లాడుతారు. ఎంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు చొక్కారావు కన్వీనర్‌గా ఉన్న స్వర్ణోత్సవ కమిటి ఈ రెండింటిలో ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు? ఒక ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర సుదీర్ఘ పోరాటాన్ని, అది అందించిన ఫలితాన్ని (సాపేక్షికమే కావచ్చు) నిజాయితీగా స్మరించు కోవాలన్న ఆలోచనతో కాకుండా రాజకీయ విచిత్ర వేషధారణ కోసం ఉపయోగించుకో జూసినప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటుంది.
హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాల సందర్బంగా .., ‘ప్రజాతంత్ర’, సెప్టెంబర్ 20, 1998