- అమరవీరుల స్ఫూర్తితోనే పాదయాత్ర
- కుటుంబ పాలనను పెంచి పోషిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించుతాం
- నలుమూలల తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
- హాత్ సే హాత్ జోడో యాత్రలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- ములుగుకు చేరిన కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర
ములుగు నుంచి ప్రజాతంత్ర బృందం, ఫిబ్రవరి 7 : తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ప్రవేశం లేని రాష్ట్ర ప్రగతి భవన్ ఎవరికోసమని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. యువకుల ప్రాణ త్యాగంతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ ఆస్తిగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో అధికారంలో చేరి తెలంగాణ ప్రజలపై లక్షల కోట్ల అప్పులు మోపి తన కుటుంబాన్ని స్వర్గధామం చేసుకున్న కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించాడు. హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ములుగు కార్నర్ సభలో అధిక సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ఆత్మబలిదానాలు ఉండకూడదని, ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నష్టం జరుగుతున్నదని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ప్రతి ఒక్కరం రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. గడచిన తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ 2, 3 లక్షల కోట్ల అప్పులు చేశాడని వివరించాడు.
అధికారంలోకి రాకముందు తొడుక్కోవడానికి చెప్పులు లేని కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు మాయం చేసుకున్నాడని విమర్శించాడు. రాష్ట్రంని సుభిక్షంగా పాలిస్తున్నానని చెబుతున్న కేసీఆర్ పెట్టుబడిదారులకు, ధనికులకు భూస్వాములకు, తివాచీలు పరుస్తున్నాడని ఎద్దేవా చేశాడు. మాది కుటుంబ పాలనని సిగ్గు లేకుండా చెబుతున్న కేటీఆర్ ఉద్యమ సమయంలో అమెరికాలో చిప్పలు కడుక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రజలు అమాయకులు కావడంతోనే కెసిఆర్ ఆటలు సాగుతున్నాయని అన్నాడు. ప్రగతిభవన్లో కేసీఆర్ కుటుంబం, బంధువులు మాత్రమే ఉన్నారని, మంత్రివర్గంలో కూడా చేరారని అలాంటి ప్రగతి భవన్ ఉంటే మనకెందుకు, నక్సలైట్లు పేల్చితే మనకెందుకు అని తీవ్రస్పర్వంతో అన్నారు. గతంలో డైనమైట్లు పెట్టిన నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చినా పట్టించుకోబోమని అన్నారు. రాష్ట్రంలో 24 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుండగా, 50 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 80 వేల మంది రైతులు చనిపోయినట్లు ప్రభుత్వమే చెబుతున్నదని వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం కళ్ళు తెరవాలని ఇదే స్ఫూర్తిని కొనసాగించి కేసీఆర్‌ను గద్దె దించేంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నలుదిక్కుల పాదయాత్ర చేపట్టి సీతక్క, బలరాం నాయక్‌లతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వివరించారు. తమ ప్రభుత్వం రావడంతోనే వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాజీ ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, పోరిక బలరాం నాయక్, భూపాలపల్లి నియోజకవర్గం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ములుగుకు చేరిన కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర
టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి స్థానిక ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తో కలిసి ప్రారంభించిన యాత్రకు గ్రామ గ్రామాన ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ములుగు కేంద్రంగా చేపట్టిన యాత్ర నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది .రెండో రోజు రామప్ప దేవాలయంలో ప్రారంభమైన యాత్ర ఒక్కో పల్లె దాటుతూ కూలీలు, రైతులు, ప్రజలతో రేవంత్ రెడ్డి మమేకమై మాట మాట కలుపుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగింది. మంగళవారం సాయంత్రం ములుగు చేరిన యాత్రకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వొచ్చిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు .