న్యూ దిల్లీ, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 ఆఖరు తేదీ. ఒకరికి మించిన అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది.
16వ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తారు. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్ సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది వోటు హక్కు వినియోగించుకుంటారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య వారసుడుగా ఎవరు ఎన్నిక కాబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు ఒక్క మహిళా కూడా ఉపరాష్ట్రపతిగా లేనందున ఈసారి ఆ అవకాశం మహిళకు దక్కనుందా అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే మహిళకు రాష్ట్రపతి దపవి కట్టబెట్టనున్నందున అలాంటి అవకాశం ఉండకపోవచ్చన్న వాదనకూడా ఉంది. ఎన్‌డిఎ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంది. లేకుంటే వెకయ్యనే మళ్లీ కొనసాగిస్తారా అన్నది చూడాలి.