ఉమ్మడి పాలమూరు జిల్లాలో… నేటి నుండి రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో యాత్ర’

  • మక్తల్‌ ‌నుంచి శ్రీకారం…రాహుల్‌కు భారీగా స్వాగతం పలికేందుకు భారీ సన్నాహాలు
  • మూడంచల భద్రతా ఏర్పాట్లలో పోలీసులు
  • పాలమూరులో ఐదు రోజుల పాటు 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు
  • ఏర్పాట్లను పరిశీలించిన ఎఐసిసి కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌

మహబూబ్‌నగర్‌, ‌మూడు రోజుల విరామం అపంతరం రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నేడు పున: ప్రారంభం కానుంది. 23న మొదటి రోజు గుడెబల్లూరు వరకు పాదయాత్ర చేసే రాహుల్‌గాంధీ మధ్యాహ్నం తర్వాత దిల్లీ వెళ్ళారు. దీపావళి, కాంగ్రెస్‌ ‌నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం నేపథ్యంలో 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. రాహుల్‌ ‌బుధవారం రాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని విమానాశ్రయం నుంచి నేరుగా మక్తల్‌ ‌చేరుకున్నారు. నేడు మక్తల్‌ ‌సమీపంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌ ‌నుంచి ఉదయం 6.30గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. 11 గంటల వరకు మక్తల్‌ ‌పట్టణంలోని బొందల కుంటకు చేరు కుంటారు. అక్కడ మధ్యాహ్న విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి తిరిగి రాత్రి ఏడు గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి మరికల్‌లోని ఎలిగండ్ల గ్రౌండ్‌లో బస చేస్తారు. కాగా యాత్రకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయకులు భారీ ఎత్తున సన్నాహలు పూర్తి చేశారు. స్వాగత ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు, ఇన్‌చార్జిలు దఫదఫాలుగా పరిశీలించారు. పాదయాత్ర కొనసాగే మార్గమంతా వాల్‌ ‌రైటింగ్స్‌తో నింపేశారు. కృష్ణా బ్రిడ్జి నుంచి మక్తల్‌ ‌వరకు అడుగడుగునా స్థానిక నాయకులు, పార్టీ నాయకుల భారీ ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి జాతర వాతవరణం కనిపిస్తున్నది.

మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో యూనివర్సిటీ మొదలుకొని, అన్ని కళాశాలలను సందర్శించిన నాయకులు దేశ సమైక్యతను ఆకాంక్షిస్తూ రాహుల్‌గాంధీ చేస్తున్న పాదయాత్రకు అందరూ మద్దతు ప్రకటించాలని కోరారు. మక్తల్‌, ‌నారాయణపేట, కొడంగల్‌ ‌నియోజకవర్గాల నుంచి జనం వొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో నాయకులకు ఈమేరకు సంకేతాలనిచ్చి, నియోజకవర్గ నాయకులు అవసరమైన వాహనాలు, పార్టీ జెండాలు, మైకులు తదితర సామాగ్రిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఐదు రోజుల పాటు సాగే పాదయాత్ర కృష్ణావారధి నుంచి బాలానగర్‌ ‌సరిహద్దు వరకు దాదాపు 120 కిలో మీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ పాల్గొనాలని కోరుతూ కాంగ్రెస్‌ ‌విస్తృత ప్రచారం చేస్తుంది. పాదయాత్రకు ఆటంకాల్లేకుండా ఇప్పటికే రూట్‌ ‌మ్యాప్‌ను ఏఐసీసీ నాయకులు మొదలుకొని జిల్లా పార్టీల నాయకులు, పోలీసు యంత్రాంగం పలుమార్లు పరిశీలించి మార్పులు, చేర్పులు చేశారు. దేశవ్యాప్త పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌గాంధీ బృందానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. రాహుల్‌కు మొత్తం మూడంచెల భద్రతను పాదయాత్రకు కల్పిస్తున్నారు. రాహుల్‌తో పాటు పాదయాత్ర చేసే బృందాన్ని కవర్‌ ‌చేస్తూ స్పెషల్‌ ‌రోప్‌ ‌పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.

భద్రతా చర్యలలో భాగంగా ఇప్పటికే ఎన్‌ఎస్‌జీ అధికారులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ‌రాష్ట్ర డీజీపీతో సమీక్ష కొనసాగించారు. ఎక్కడికక్కడ స్థానిక ఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక పాసులు, ఐడీ కార్డులున్న వారినే రాహుల్‌ను కలిసేలా చూడనున్నారు. మొత్తంగా రాహుల్‌ ‌పాదయాత్ర అత్యంత భారీ భద్రత నడుమ నేటి నుండి నవంబర్‌ 7 ‌వరకు తెలంగాణలో కొనసాగనుంది. ఎన్‌ఎస్‌జీ అనుమతించిన వారే పాదయాత్రలో రాహుల్‌ను కలవడంతో పాటు, అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాహుల్‌గాంధీ యాత్ర మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో ఐదు రోజులు కొనసాగుతుంది. మొత్తం 120 కిలోమీటర్ల మేర ఈ రెండు జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. 27న మక్తల్‌ ‌సమీపంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌ ‌నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. 28 ఉదయం 6.30కు మొదలయ్యే పాదయాత్ర 10.30కు దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్‌కు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి యాత్ర మొదలవుతుంది. రాత్రి ఏడు గంటలకు మన్యంకొండ చౌరస్తాకు చేరుకుంటారు.

అక్కడ కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడిన అనంతరం రాత్రికి ధర్మాపూర్‌లోని జేపీఎన్‌సీఈ కాలేజీలో రాత్రి బస చేస్తారు. 29 ఉదయం ధర్మాపూర్‌ ‌నుంచి పాదయాత్ర ప్రారంభించే రాహుల్‌ ‌బృందం ఉదయం 10.30కు యేనుగొండకు చేరుకుంటుంది. అక్కడ విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి, రాత్రి ఏడుగంటలకు జడ్చర్ల చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడతారు. అనంతరం రాత్రికి గొల్లపల్లి సమీపంలోని లలితాంబిక తపోవనంలో రాత్రి బస చేస్తారు. 30న ఉదయం అక్కడి నుంచి బయల్దేరి 11 గంటలకు బాలానగర్‌ ‌సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద యాత్రకు ఉదయం విరామం ప్రకటిస్తారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి బయల్దేరి షాద్‌నగర్‌లోని సోలీపూర్‌కు చేరుకుంటున్నారు. అక్కడ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తారు.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు : ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ ‌సంపత్‌కుమార్‌
ఈ ‌సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ ‌సంపత్‌కుమార్‌ ‌మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడోయాత్రకు తరలివస్తున్నారని అన్నారు. అక్కడక్కడా టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ప్రజలు రాహుల్‌ ‌యాత్రకు వెళితే సంక్షేమ పథకాలు పోతాయని భయపెడుతున్నారని పేర్కొన్నారు. తమ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాహుల్‌ ‌పాదయాత్ర ద్వారా బయటకు వొస్తే ఇది రాష్ట్రంపైనే ఎఫెక్ట్ ‌పడుతుందని టీఆర్‌ఎస్‌ ‌భయపడుతుందని ఆయన అన్నారు. 27న మక్తల్‌ ‌నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతున్నందున మక్తల్‌ ‌నియోజకవర్గ ప్రజలతో పాటు దేవరకద్ర, అలంపూర్‌, ‌కొడంగల్‌ ‌నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కూడా యాత్రలో పాల్గొంటారన్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలోని సామాజిక వేత్తలు, రాజకీయాలకు అతీతంగా సమాజహిత కోసం పనిచేసే మేధావులు రాహుల్‌ ‌యాత్రకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడోయాత్రలో యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నియోజవర్గ అధ్యక్షుడు జే.చంద్రశేఖర్‌ ‌కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page