ఉమ్మడి పౌర స్మృతి కి – రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా సమూహాలు స్పందించటానికి సరైన సమయం లేదు. మనదేశ చట్టాలకి రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒక్క రోజులోనో లేదా విస్తృతమైన చర్చ లేకుండానో వచ్చిన అంశాలు కాదు. చట్టపరమైన మార్పులు చేర్పులూ కూడా అంచెలంచెలుగా విస్తృత చర్చల తర్వాతనే జరిగాయి, భవిష్యత్తులో కూడా అలానే జరగాలి కూడా!

గత నెల రోజుల నుంచీ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పదే పదే కనిపిస్తోంది. సారాంశం ఏమిటంటే, ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ UCC రాదు, కాబట్టి మీరు దీనికి మీ అంగీకారం తెలియజేస్తూ ఫలానా నెంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, చాలు అని! తేవాలనుకుంటున్న చట్టంలో ఏముందో, ఏముంటుందో, ఏఏ అంశాలు ఏకీకృతం లోకి వస్తాయో, భవిష్యత్తులో వాటి ప్రభావం ఏమిటో, ఉమ్మడి పౌర స్మృతి వల్ల వచ్చే వాద వివాదాలను చట్టబద్ధంగా ఎలా పరిష్కరించుకోవచ్చో, చట్టం రూపొందించటంలో జరగాల్సిన చర్చలు ఎలా ఉండాలో, ఇంతకు ముందు ఐదేళ్ల క్రితం 21 వ లా కమిషన్ ఏమి ప్రతిపాదన చేసిందో, వాటి ఔచిత్యం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదనే నిర్లక్ష్య పూరిత ధోరణి ఈ సందేశాల్లో ఉంది. ఏ రకమైన చర్చా, ప్రక్రియలు ఏమీ అవసరం లేకుండా వో మూడు అక్షరాలకు ఆమోదం ఈ విధంగా బహుశా ఏ నాగరిక సమాజంలోనూ, దేశంలోనూ జరగదేమో!? అసలు ప్రజా భాగస్వామ్యం ఈ విధంగానా ఉండాల్సింది!?

ప్రధానంగా పెళ్లి, విడాకులు, పిల్లల సంరక్షణ, దత్తత, వారసత్వం వంటి అంశాలలో భిన్న సమూహాలకు ఉమ్మడి రూపం, సారం ఇవ్వటం సాధ్యం అవుతుందా? వీటిలో ఉండే చారిత్రిక, భౌగోళిక విభిన్న అంశాలను ఎలా అర్థం చేసుకుంటాము? ఏ సమూహమైనా తమ ప్రత్యేక అస్తిత్వాన్ని, వాటిలో ఇమిడి ఉండే ప్రత్యేక అంశాలను కోల్పోవటానికి అంగీకారం తెలుపుతుందా? వైవాహిక స్థితితో సంబంధం లేకుండా దత్తత వంటి అంశాలు, వారసత్వంలో జెండర్ సమానత్వం వంటి వాటికి విధివిధానాలు ఏమిటి? ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలకు, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఉమ్మడి చట్టానికీ ఉండే మౌలిక భేదం ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి? స్త్రీ, పురుష, ట్రాన్స్జెండర్ సమానత్వానికి, న్యాయానికి UCC లో ప్రతిపాదిస్తున్న అంశాలు ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య వివక్షని రూపుమాపటానికి తీసుకునే చర్యలు ఏమిటి? విధానాలు ఎలా ఉంటాయి? నోటి మాట కాదు, రాతపూర్వకమైన డ్రాఫ్ట్ ని ఎందుకని తయారు చేయలేకపోతున్నారు? ఇవి కదా రావలసిన ప్రాథమిక ప్రశ్నలు!

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా సమూహాలు స్పందించటానికి సరైన సమయం లేదు. మనదేశ చట్టాలకి రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒక్క రోజులోనో లేదా విస్తృతమైన చర్చ లేకుండానో వచ్చిన అంశాలు కాదు. చట్టపరమైన మార్పులు చేర్పులూ కూడా అంచెలంచెలుగా విస్తృత చర్చల తర్వాతనే జరిగాయి, భవిష్యత్తులో కూడా అలానే జరగాలి కూడా! అలాంటిది, చట్టపరమైన సూచనలు అందించాల్సిన లా కమిషన్ ఒక సున్నితత్వంతో కూడిన వివాదాస్పద సంక్లిష్ట అంశంలో గత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ను, సూచనలను పరిగణన లోకి ఎందుకు తీసుకోలేదు?

ఉమ్మడి పౌర స్మృతి అనగానే ఎప్పుడూ కూడా ముస్లిం సమూహంలో వుండే బహుభార్యత్వం ఒక్కటే చర్చనీయాంశంగా ఉంటుంది. వాస్తవానికి, 2019-20 లో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం లెక్కలు వేరే విధంగా ఉన్నాయి. అన్ని మత సమూహాలలో బహుభార్యత్వం ఉంది. ఇది కేవలం ముస్లిం సమూహాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నిజానికి, బహుభార్యాత్వ వివాహాలలో మహిళల హక్కులు ఏమిటి, వాటిని అమలు చేసే విధానాల మీద విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

కుటుంబ చట్టాలలో రావలసిన సంస్కరణలపై 21వ లా కమిషన్ స్పష్టమైన సిఫార్సులే చేసింది. “వ్యక్తిగత చట్టాలలో సంస్కరణలను వివిధ సవరణల ద్వారా చేయాలి తప్పించి ఏకపక్షంగా వాటిని రద్దు చేయటం ద్వారా కాదు” అనేది ముఖ్యమైన సూచన. అలానే, ‘ప్రతి మత సమూహంలోనూ జెండర్ సమానత్వం అనేది ఉండాలి తప్పించి, అన్ని సమూహాలూ ఒక్కలాగే ఉండటం ద్వారా వివక్ష పోదని, వివక్ష మూలాలు వేరే ఉన్నాయి, వాటి నిర్మూలనకు పని చేయాలి అనేది కూడా ఇంకో ముఖ్య సూచన. మరి, స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే ఇంత ముఖ్యమైన సూచనలు పట్టించుకోకుండా ఈ 22 వ లా కమిషన్ మళ్లీ ఎందుకు ఈ కసరత్తును జూన్ 14, 2023 న మొదలు పెట్టి, 15 జులై నాటికి (కేవలం నెల రోజుల సమయం) ఎందుకు ముగిస్తున్నట్టు ? పైగా, ఏ విధమైన రెఫెరెన్స్ లేకుండా, అస్పష్టంగా వివిధ కోర్టు ఉత్తర్వులతో స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ అన్ని విషయాలను ఒకే గాటన ఎందుకు కడుతున్నట్టు? వాటి వివరాలను కూడా చెప్పాల్సిన బాధ్యత లేదా? పైగా, తీసుకురావాలనుకుంటున్న ఈ చట్టంవల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేది అన్ని సమూహాల లోని మహిళలు. మరి, గుర్తింపు పొందిన ‘పెద్ద మత సంస్థల’ నుంచీ అభిప్రాయాలను కోరటం అంటే అర్థం ఏమిటి?

కుటుంబ చట్ట సంస్కరణలలో కుల, మత, ఆదివాసీ సమూహాలలోని మహిళలు, జెండర్ మైనారిటీలు, ఇతరుల స్థానం ఏమిటి? వారు ‘కుటుంబం’ లో ప్రాధమిక సభ్యులు కారా? వారసత్వం అంశాలు అంటేనే భూమి, ఆస్తి, వనరులు. అవి, ఒక్కో సమూహంలో రకరకాలుగా ఉంటాయి. (ఉదాహరణకు, 2005 హిందూ వారసత్వ చట్టం ప్రకారం స్త్రీలకు ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఇచ్చినప్పటికీ, వాస్తవంలో ఆ హక్కును అందుకోవటం కోసం స్త్రీలు చాలా యుద్ధం చేయాల్సి ఉంటుంది.) పైగా, షెడ్యూల్ V & VI లో వుండే ఆదివాసీ సమూహాల భూములు, వనరుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? గోవా లాంటి రాష్ట్రాలలో అమలులో ఉన్న ఉమ్మడి చట్టాలపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? అసలు, అక్కడ అమలులో ఎదురయ్యే సమస్యలు ఏమున్నాయి? నిజానికి అటువంటి అంశాల మీద ప్రజల్లో సరైన సమాచారం లేదు. ఇవన్నీ కూడా చర్చించవలసిన అంశాలే కదా? అసలు, ఏమీ తెలియకుండా, ఏ చర్చా లేకుండా రూపమే లేని ఒక ప్రతిపాదిత చట్టానికి ఒక మిస్డ్ కాల్ ద్వారా అంగీకారం తెలియజేయమని బాధ్యతారహితంగా ఎవరైనా ఎలా అడుగుతారు ..???

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page