ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం
శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక
భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం
పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలాన్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగు తుండటాన్ని బట్టి నాగార్జునసాగర్‌ ‌గేట్లు గురువారం తెరచుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువన వర్షాలతో కృష్ణా గోదావరి నదుల్లో ఉద్ధృత ప్రవాహం నమోదవుతోంది. కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం గేట్లను ఒక్కోటి పెంచుతూ మంగళవారం రాత్రికి ఎనిమిదింటిని తెరిచారు. ఏపీ, తెలంగాణ ఉత్పత్తి కేంద్రాల ద్వారా జలవిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. జలాశయం నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నారాయణపూర్‌ ‌నుంచి 1.46 లక్షల, తుంగభద్ర డ్యాం నుంచి 1.59 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా ఇవి మరింత పెరిగే సూచనలున్నాయి. మరోవైపు నాగార్జునసాగర్‌ ‌వద్ద 1.83 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో నమోదవుతుంది. మంగళవారం సాయంత్రానికి ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 578.20 అడుగుల వద్ద ఉంది. 589.50 అడుగులకు చేరుకున్నాక గేట్లు తెరవాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి గురువారం గేట్లు తెరచుకునే అవకాశాలున్నాయి. గతేడాది ఆగస్టు నెలలోనే సాగర్‌ ‌గేట్లు తెరచుకున్నాయి. కృష్ణానదికి భారీ వరదలు వొచ్చినపుడు తప్ప మరెప్పుడూ ఆగస్టులో గేట్లు తెరచుకున్న దాఖలాలు లేవు. గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది.

జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డ) వద్ద 7.30 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన మానేరు ఇతర ఉపనదులు, వాగులతోపాటు ప్రాణహిత నుంచి వొస్తున్న వరదతో మేడిగడ్డ నుంచి దిగువకు పెద్దఎత్తున ప్రవాహం వెళ్తుంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతుంది. అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరిన నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఉదయం 11 గంటలకు గోదావరి నీటిమట్టం 50.3 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి రానుంది. గోదావరిలోకి ఎగువ నుంచి 12.72 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది. రుతుపవనాల ద్రోణి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నుంచి వాయుగుండం ఏర్పడిన ప్రాంతం వరకూ వ్యాపించింది.

తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని, అక్కడక్కడ ఒక మోస్తరుగా కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ..రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ ‌జిల్లా ఎడపల్లిలో 4.3, డిచ్‌పల్లిలో 3.9, సాలూరలో 3.3, చిమ్నంపల్లిలో 3.3, నిజామాబాద్‌లో 3.2 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాచలం దగ్గర 49.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చురికలు జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలం నుంచి దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురానికి బస్సులను బంద్‌ ‌చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ‌ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 580 అడుగుల మేర నీరున్నది. డ్యామ్‌ ‌గరిష్ఠ నిల్వసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 283.01.60 టీఎంసీల మేర నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,818 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2570 క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఎగువన కురుస్తున్న భారీ వానలకు నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా ఇన్‌ ‌ఫ్లో వొస్తుంది. దీంతో సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 6.30 గంటలకు క్రస్ట్ ‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని డ్యామ్‌ అధికారులు సూచించారు. ఈ విషయాన్ని డ్యామ్‌ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page