ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

  • 20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు
  • హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్‌ ‌దేశానికే తలమానికంగా నిలువబోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌కి ప్రభుత్వం  సోమవారం  రూ.146 కోట్ల 28 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ(టిఎస్‌ఈడబ్య్లూఐడిసి) ఆధ్వర్యంలో పనులు జరిగాయి. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్నిరకాల విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.  ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీలు, మోడల్‌ ‌స్కూల్‌, ‌ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్‌లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. గజ్వేల్‌లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్‌ను నిర్మించారు. దానికి ఒక కిలోమీటర్‌ ‌దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్‌ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు.

విశాలమైన తరగతి గదుల్లో పగటివేళల్లో సహజసిద్ద వెలుగు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో సైన్స్ ‌ల్యాబులు రూపొందించారు. ఉత్తమ బోధనతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఏర్పాట్లు చేశారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్‌ ‌ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్‌లో 2,500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1,000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్‌లో చదుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచస్థాయికి ఎదిగేలా విద్యాబోధన కొనసాగిస్తున్నారు.

పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లిష్‌ ‌మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్‌ను కొనసాగిస్తున్నారు. గజ్వేల్‌లో విద్యా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేయడం పట్ల గజ్వేల్‌ ‌ప్రాంతానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ…ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, గజ్వేల్‌ ‌స్ఫూర్తితో మరికొన్ని జిల్లాల్లో విద్యాహబ్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page