వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: జిల్లాలో ఎన్నికల వ్యాయన్ని సరైన విధంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యాయ పరిశీలకులు మునిష్ రజిని సూచించారు. శుక్రవారం జిల్లా అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు మునిష్ రజిని జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండే వివిధ రాజకీయ పార్టీల, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియామవళినీ అనుసరించి చేస్తున్న ఖర్చులపై ఏంసిసి వ్యయ విభాగంలో నిర్వహిస్తున్న రికార్డులను వ్యయ పరిశీలకులు పరిశీలించారు. వార్తాపత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆరా తీశారు. ఎంసిఎంసి ద్వారా ప్రచారం నిమిత్తం ఇచ్చే అనుమతులను, అడ్వర్టైజ్మెంట్ తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనీ చెక్ పోస్టులను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయన పరిశీలించారు. అదేవిధంగా 1950 కాల్ సెంటర్, సి. విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయిలో అధికారులు నియమించడం జరిగిందని అబ్జర్వర్ కు తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో భాగంగా మద్యం, డబ్బుల తరలింపు పై ప్రత్యేక బృందాలను నియమించి అరికట్టేందుకై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సందర్శనలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఏంసిసి నోడల్ అధికారి కృష్ణన్, ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి శంకరాచారి, ఎంసీఎంసీ నోడల్ అధికారి ఆరిఫోద్దిన్ ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.