- ఏడుగురు కార్మికుల దుర్మరణం
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కాకినాడ, ఫిబ్రవరి 9 : కాకినాడలో భారీప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా… పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్‌లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులు ఊపిరి అందలేదు.
వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అంబటి సుబ్బయ్య ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు కార్మికులు ట్యాంకర్‌లోకి దిగారు. ప్రమాదవశాత్తు ట్యాంకర్‌లో ఊపిరాడకపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ••గా, ఇలాంటి ఘటనల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరుగ కుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి.