బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 7 : జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తూ..బీజేపీ నాయకుల, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడపట్ల చూపితే న్యాయం జరిగేది అని అన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొంటూ..ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని, ఇది ముమ్మాటికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకానితనమేనని, నేరాలను అరికట్టడంలో తామే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని, ఈ ఘటనలపై స్పందించరా అని బండి సంజయ్ నిలదీసారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని తెలిపారు.
భారతీయ జనతా యువమోర్చా రాస్తా రోకో..
జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము వెంటనే సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేపట్టారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాస్తారోకో నిరసనకు దిగిన బిజెవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడాల అనంత్ కృష్ణ ఇతర యువమోర్చా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తు పార్టీ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో దాదాపు 500 వందల మంది యువమోర్చా నాయకులు ..రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నాయకులు దాదాపు 1100 మంది యువమోర్చా నాయకులు వరకు అరెస్ట్ అయినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.