హయత్ నగర్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఎల్బీనగర్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా రుద్రాల శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎల్బీనగర్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేఏసీ సభ్యులు ఎల్బీనగర్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రుద్రాల శ్రీరాములు మాట్లాడుతూ.. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతానని తెలిపారు. తనపై నమ్మకంతో తనను ఎల్బీనగర్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్టుల కమిటీ అధ్యక్షులుగా నియమించినందులకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి జేఏసీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల కమిటీ ముఖ్యసలహాదారులుగా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గిరి (యాదయ్య), తలారి గణేష్, ప్రధాన కార్యదర్శిగా భూచక్రంగౌడ్, సహాయ కార్యదర్శులుగా కాంతయ్య, పీఆర్కే రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ చైర్మన్ వీ.ఎన్ రాజు, చీఫ్ అడ్వజర్ చామకూర రాజులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.