ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి?
ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..?

‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం
ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌పై గత కొంత కాలంగా విచారణ జరుగుతుండగా మూడ్రోజుల కిందట ఏపి మాజీ సిఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని సిఐడి అరెస్టు చేసింది. ఏసిబి కోర్టు బాబుకు ఈ నెల 22వరకు జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌ ‌విధించింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న విషయం విధితమే. ఇప్పటికే ఈ కుంభకోణంపై ఈడీ కూడా విచారణ జరుపుతుండగా పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్‌మెంట్లు కూడా జరిగాయి. షెల్‌ ‌కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్ట్, ‌రిమాండుతో నేపథ్యంలో అటు సిఐడి, ఇటు ఏపిలోని అధికార వైసిపి నేతల నోటి నుండి వినిపిస్తున్న ఏకైక పేరు ఇల్లెందుల రమేష్‌. ‌ముఖ్యంగా వైసిపికి చెందిన మాజీ మంత్రి, మంచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య అలియాస్‌ ‌పేర్ని నాని తరుచూ ఈ స్కిల్‌ ‌డెవలప్‌మెంటు స్కామ్‌లో తెలంగాణకు చెందిన ఇల్లెందుల రమేష్‌ ‌పేరును ప్రస్తావిస్తున్నారు. 3300కోట్లకు సీమెన్స్ ‌సంస్థ – డిజైన్‌టెక్‌ ‌సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 370 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్‌ ‌కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి అధికారులు నిగ్గుతేల్చారు. అయితే, ఈ సంస్థలను పరిచయం చేసిందే ఇల్లెందుల రమేష్‌ అని ఏపిలో అధికార పార్టీకి చెందిన వైసిపి శ్రేణులు ప్రధానంగా పేర్ని నాని అంటున్నారు. అయితే, ఇంతకూ ఈ ఇల్లెందుల రమేష్‌ ఎవరు? అనే విషయం తెలుసుకుందాం. దీనిపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?
ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంటు స్కామ్‌లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన పాత్రధారి, సూత్రధారి అంటూ సిఐడి అరెస్టు చేయడం..ఏసిబి కోర్డు జ్యుడిషియల్‌ ‌రిమాండుకు పంపిన విషయం విధితమే. అయితే, ఇదే కేసులో వైసిపి శ్రేణులు ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని పదే పదే ప్రస్తావిస్తున్న పేరు తెలంగాణకు చెందిన ఇల్లెందుల రమేష్‌. అసలు ఈ రమేష్‌ ఎవరు అని ‘ప్రజాతంత్ర’ ఆరా తీయగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇల్లెందుల రమేష్‌ ‌టిడిపి పార్టీలో సీనియర్‌ ‌నాయకుడు. రమేష్‌కు టిడిపి పార్టీకి విడదీయరాని బంధం ఉందని తెలుస్తుంది. ఇతనికి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సన్నిహిత సంబధాలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ ఇల్లెందుల రమేష్‌ ‌స్వగ్రామం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ ‌మండలంలోని గొడుగుపల్లి. రమేష్‌ ‌టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నాడు.

రమేష్‌ ‌తొలుత తన స్వగ్రామమైన గొడుగుపల్లి ఉప సర్పంచి, సర్పంచిగా పని చేశాడు. దౌల్తాబాద్‌ ‌జడ్పిటిసిగా పోటీ చేసి వెయ్యి వోట్ల తేడాతో ఓడిపోయాడు. టిడిపిలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉంటూ…కాంట్రాక్టు పని చేసినట్లు సమాచారం. రమేష్‌ ‌ప్రస్తుతం టిడిపి మెదక్‌ ‌పార్లమెంటు అధ్యక్షుడిగా, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఇల్లెందుల రమేష్‌ ‌మాత్రం…చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో టిడిపిలోనే కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబు ఆదేశిస్తే సిఎం కేసీఆర్‌పైన కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు రమేష్‌. ఇల్లెందుల రమేష్‌…‌ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..?
టిడిపి పార్టీ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించిన అనేక మంది సీనియర్లు టిడిపిని వీడి బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరినా ఇల్లెందుల రమేష్‌ ‌మాత్రం టిడిపిలోనే ఉండటం వల్ల చంద్రబాబుకు దగ్గరయ్యేలా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే రమేష్‌ను మెదక్‌ ‌పార్లమెంటు అధ్యక్షుడితో పాటు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జిగా రెండు బాధ్యతలు ఇచ్చేలా చేసినట్లు తెలుస్తుంది. 2014లో చంద్రబాబు ఏపి సిఎం అయ్యాక వొచ్చిన హుదూద్‌ ‌తుఫాన్‌ ‌సమయంలో రమేష్‌కు సమీప బంధువుకు చెందిన ఓ ఐటి కంపెనీ అధినేతతో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇప్పించి బాబుకు రమేష్‌ ‌మరింత దగ్గర అయ్యేలా చేసిందని ఓ వాదన బలంగా వినిపిస్తుంది.

ఇదే చంద్రబాబుతో ప్రాజెక్టు డీల్‌ ‌చేసే వరకు తీసుకెళ్లేలా చేసిందని తెలుస్తుంది. చంద్రబాబుతో తనకున్న పరిచయంతో రమేష్‌కు అప్పటికే తెలిసిన సీమెన్స్ ‌సంస్థ-డిజైన్‌టెక్‌ ‌సంస్థల ప్రాజెక్టు విషయమై ఏపి సచివాలయంలోని సంబంధిత శాఖకు చెందిన ఓ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ ద్వారా అప్పటి సిఎం చంద్రబాబును కలిసి ఈ ప్రాజెక్టుకు చెందిన వ్యక్తులను పరిచయం చేయించినట్లు తెలుస్తుంది. వైసిపి నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు రమేష్‌ ‌పరిచయం చేసిన ప్రాజెక్టుకు సంబంధించి వెనకా, ముందు ఆలోచించక ఓకే చేసినట్లు సమాచారం. రమేష్‌ ‌టిడిపి ఆవిర్భావం నుండి ఉండటం, తుఫాన్‌ ‌టైమ్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇప్పించడంతో చంద్రబాబు గుడ్డిగా నమ్మి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో…ఇప్పుడు బాబును జైలుకు వెళ్లేలా చేసిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

‘సారీ…నాకేమీ తెలియదు…నాకు పరిచయం లేదు’ : ‘ప్రజాతంత్ర’తో ఇల్లెందుల రమేష్‌
ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంటు స్కామ్‌కు సంబంధించి వైసిపి శ్రేణుల నుండి ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఇల్లెందుల రమేష్‌. ఇల్లెందుల రమేషే ప్రాజెక్టును పరిచయం చేయించారని వొస్తున్న వార్తలపై మంగళవారం ‘ప్రజాతంత్ర’ ప్రతినిధి ఫోన్‌లో ఇల్లెందుల రమేష్‌తో మాట్లాడగా…‘ఈ విషయంలో నాకేమీ తెలియదు. నాకు పరిచయం లేదు. కావాలనే చేస్తున్నారు. సారీ ఇంతకంటే నన్నేమీ అడుగొద్దు’ అంటూ ఫోన్‌ ‌పెట్టేశారు.

కొసమెరుపు ఏంటంటే…
తనకేమీ తెలియదని ఫోన్‌లో చెప్పిన రమేష్‌ ‌చంద్రబాబు అరెస్టు అక్రమం..జగన్మోహన్‌రెడ్డి ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట అంటూ అరెస్టు రోజు ప్రస్‌ ‌నోట్‌ ‌విడుదల చేయడం. ఈ స్కామ్‌లో ఇల్లెందుల రమేష్‌ ‌పేరును వైసిపి నేత పేర్ని నాని పదే పదే ప్రస్తావిస్తుండగా..ఈ విషయమై మంగళవారం ‘ప్రజాతంత్ర’ సెల్‌ఫోన్‌లో సంప్రదించగా ‘నాకేమీ తెలియదు’ అంటూ ఫోన్‌ ‌పెట్టేసిన రమేష్‌…‌చంద్రబాబును ఈ నెల 9న నంద్యాలలో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన రోజే మీడియాకు టిడిపి మెదక్‌ ‌పార్లమెంటు అధ్యక్షుడు, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి హోదాలో ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ఆ ప్రెస్‌నోట్‌లో రమేష్‌…‘‌తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు అక్రమం. జగన్మోహన్‌రెడ్డి ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట.

రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో నడిపించిన మహనాయకుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు మచ్చలేని మనిషి చంద్రబాబునాయుడుని అరెస్టు చేసి ఆయనకు అవినీతి మచ్చ వేయడం పిచ్చి చేష్టలు. జగన్‌ ‌ప్రభుత్వంకు పోయే కాలం వొచ్చింది. సంబంధంలేని విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీలో పేరు లేని చంద్రబాబుని అరెస్ట్ ‌చేశారు. ఇదొక ఉద్దేశపూర్వకంగా చేసిన అరెస్టుగా, ఒక ఉన్మాది చర్యగా మేము భావిస్తున్నాం’ అని అనేక అంశాలను పేర్కొన్నారు. ఇలా పేర్కొనడాన్ని లోతుగా పరిశీలిస్తే చందబ్రాబుకు, రమేష్‌కు ఉన్న లింకు ఏమిటో చెప్పడం, అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఇప్పుడు మెతుకు సీమలో ఇదే హాట్‌ ‌టాపిక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page