ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: మహాత్మా జ్యోతరావు పులే అమ్మ సావిత్రి బాయి పులే దంపతులు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ 150వ ఆవిర్భావ మహోత్సవం ఈ నెల 23 న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు సత్యశోధక్ సమాజ్(ఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బట్టి చెన్నయ్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ ముక్తి మోర్చ జాతీయ అధ్యక్షులు(న్యుడిల్లి) వామణ్ మేశ్రాం, అంబేద్కర్ యువజన సంఘాల వ్యవస్థపకులు జెబి.రాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ పులే దంపతులు 1848 నుండి 1873 వరకు 25సంవత్సరాలు ఈ దేశంలో మొట్టమొదట ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీలకు విద్యను అందించడానికి విద్యా ఉద్యమం నడిపారని గుర్తు చేశారు. ఈ విద్యా ఉద్యమ చైతన్యాన్ని సంస్థాగత నిర్మాణంలోకి తేవడానికి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ప్రారంభించి ఈ దేశ బహుజనుల యొక్క సత్యవంతమైన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారని అన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించారని పేర్కొన్నారు. పురోహితుల ద్వారా ఏర్పడిన అసత్యమైన సమాజ వ్యవస్థలో సత్యాన్ని శోధించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అందులో ప్రధానంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు నిర్వహించడం, మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు మానవుని జీవన గమనంలో నిర్వహించుకునే ప్రతి కార్యక్రమాన్ని సత్యశోధక్ సమాజ్ లో నిర్వహించడానికి గల ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలను రూపొందించారని అన్నారు. అందులో ప్రధానంగా సత్యశోధక్ ఆదర్శ వివాహాలు, నామకరణ మహోత్సవాలు, కేశకండనాలు, జ్ఞాన వస్త్రధారణ మొదలగు అనేక సంఘసంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దీనితో పాటు రైతులను తమ కాళ్లపై తాము నిలబడే విధంగా రైతు ఉద్యమాలను, పలు సంస్కరణలను చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్ బట్టు, బిబిఎం రాష్ట్ర అధ్యక్షులు వళిగి ప్రభాకర్, ఆర్ఎంఎం రాష్ట్ర అధ్యక్షులు ఖదీర్, బామ్సెఫ్ జాతీయ కార్యదర్శి కుమార్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్, ఎవైఎస్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్, దయనంద్, సిక్కు సంఘం నాయకులు సురేందర్, బీవీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.