ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

గతంలోనే వర్గీకరణకు కెసిఆర్‌ మద్దతు
అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై హరీష్‌ రావు మాట్లాడుతూ..వర్గీకరణపై తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభా నాయకుడిగా కేసీఆర్‌ నవంబర్‌ 29, 2014లో వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు సభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. కేంద్రానికి ఏకగ్రీవంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని.. తీర్మానం చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్‌ తీసుకుని వెళ్లి ఆ నాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి ప్రధానిని కలిసి అందజేశారని గుర్తు చేశారు.

అంతే కాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్‌ వివరించారని..ప్రధాని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్‌ అనీ, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ఆ రోజు సానుకూలంగా స్పందించారన్నారు. అయితే, వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందని.. ఎన్నో త్యాగాలు జరిగాయన్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన సంగతి మనకు తెలుసునన్నారు. ఇదే గాంధీ భవన్‌ దగ్గర పెట్రోల్‌ పోసుకొని ఆ రోజు కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. కానీ, ఆ మాదిగలకు కేసీఆర్‌.. తమ ప్రభుత్వం వొచ్చిన వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్‌ఎస్‌, నాయకుడు కేసీఆర్‌ అని తెలిపారు.

ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని.. వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని గాంధీ భవన్‌ వద్ద పెద్ద ఎత్తున మాదిగలు ముట్టడికి వొచ్చి పోరాటం చేసేందుకు వొచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్‌ ప్రభుత్వం ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్‌ పట్టించుకోకుండా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అంటూ ధ్వతజమెత్తారు. ఏదిఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైన సందర్భమన్నారు.

దశబ్దాల కల నెరవేరినటువంటి రోజని.. దాంతోనే ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున సుప్రీమ్‌ కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్‌ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామని, కానీ, నిన్న ఇవాళ సభ జరిగిన తీరు మా హృదయాలను గాయపరిచిందన్నారు. మహిళా శాసనసభ్యులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page