- కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
- మూడు దశబ్దాలుగా ఎమ్మార్పీఎస్ పోరాటం…
- కమిటీ ఏర్పాటుపై ఎమ్మార్పీఎస్ హర్షం…సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం
న్యూ దిల్లీ, జనవరి 19 : ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోమ్, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. వర్గీకరణపై ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీమ్ కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే. కమిటీ ఈ నెల 22న తొలిసారిగా భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎంఆర్‌పిఎస్ మందకృష్ణకు హావిూ ఇచ్చారు. ఈ మేరకు అడుగులు పడ్డాయి.
కమిటీ వర్గీకరణపై సమగ్ర పరిశీలన జరుపనుంది. ఇక రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం అందులో పలు కీలకమైన శాఖలకు స్థానం కల్పించింది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు త్వరగా రిపోర్టు ఇవ్వడానికి సమాయత్తమైన కమిటీ.. ఈ నెల 22న తొలిసారిగా సమావేశం కానుంది. ప్రభుత్వానికి త్వరగా రిపోర్ట్ ఇవ్వడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో సబ్`కేటగిరైజేషన్ పక్రియలో భాగంగా ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని నవంబరు 24నే కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
కమిటీ ఏర్పాటుపై ఎమ్మార్పీఎస్ హర్షం…సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నయమించడంతో దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హావిూ నిలబెట్టుకున్నారని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ దీనిపై హావిూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీ నియమిస్తున్నట్లుగా ప్రధాని మోదీ అదేశాలు ఇచ్చారు. ఇన్నాళ్లకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు అయింది. మందకృష్ష మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.