డ్వాక్రా మహిళల డబ్బులను కాజేసిన వైనం
కరివారిగూడెంలో రూ.30 లక్షల పైగా మోసం
ఏడాదిగా ఊళ్లోకి రాని వెలుగు సిబ్బంది
రుణాలు తీర్చాలంటూ బ్యాంకు అధికారుల నోటీసులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
న్యాయం చేయాలని డ్వాక్రా సంఘాల దళిత, గిరిజన మహిళల వేడుకోలు
జూలూరుపాడు, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డిఆర్డిఏ)ను అమలు చేస్తుంది. ఇందులో ప్రధానమైన శాఖగా ఇందిరా క్రాంతి పథం(ఐకెపి) రూపు దాల్చింది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో ప్రధానమైన అంశం నిరుపేద మహిళల్లో చైతన్యం, అభివృద్ధి. ఇందుకోసం ఇందిరా క్రాంతి పథంలో డ్వాక్రా స్వయం సహాయక సంఘాలను తయారు చేశారు. ఈ మేరకు నిరుపేద మహిళా సభ్యులతో కూడిన స్వయం సహాయక సంఘాలు గ్రూపులు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. నిరుపేద మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారిలో చైతన్యం నింపేందుకు ఇందిరా క్రాంతి పథం ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి. డిఆర్డిఏ రూపొందించిన ప్రత్యేక నియమావళిని ఐకెపి ఉద్యోగలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో క్లస్టర్ కోఆర్డినేటర్లు(సీసీలు), పథకాన్ని మండలంలో పర్యవేక్షించే అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపిఎం) బాధ్యతారాహిత్యం కారణంగా జూలూరుపాడు మండలంలో డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు చెందిన నిరుపేద మహిళలు కూడగట్టుకున్న సొమ్ము పరుల పాలైంది. వీరంతా గిరిజన, దళిత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కావడం గమనార్హం. జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో సంఘటన వెలుగు చూసింది.
తమకు న్యాయం చేయాలని జూలై 26వ తేదీన ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరివారిగూడెం గ్రామంలో బుధవారం మహిళలు విలేఖరుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. వారు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..కరివారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కరివారిగూడెం, కరివారిగూడెం కాలనీ, తవిసిగుట్ట గ్రామాల పరిధిలో దాదాపు 30కి పైగా డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మహిళా సభ్యులతో కూడిన ఈ గ్రూపులను 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటి వరకు అన్ని గ్రూపులు సక్రమంగానే పనిచేస్తున్నాయి. వీరంతా బ్యాంకులో డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు తీసుకున్న రుణాలను ప్రతి నెలా తిరిగి చెల్లిస్తున్నారు. గ్రామానికి దగ్గరలో ఉన్న సుజాతనగర్ మండల కేంద్రంలోని ఆంధప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఖాతాలు ఏర్పాటు చేసుకుని మొదటి నుంచి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. మహిళల నుంచి పొదుపు, రుణాల డబ్బులను ప్రతినెలా వసూలు చేసి బ్యాంకులో జమ చేసేందుకు బ్యాంక్ ఉద్యోగులతో పాటు వెలుగు ఉద్యోగుల సమన్వయంతో గ్రామ దీపికను, బ్యాంకు మిత్రను నియమించారు. ఉద్యోగులు చెప్పిన మాట ప్రకారం బ్యాంకు మిత్ర అయిన అదే గ్రామానికి చెందిన గరిడి దుర్గారావుకు ప్రతినెలా డబ్బులను చెల్లిస్తున్నారు. అయితే రెండేళ్ల తర్వాత బ్యాంకులో తీసుకున్న అప్పు తీరింది అనే ఉద్దేశంతో తిరిగి కొత్త రుణాలు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది.
బ్యాంకులో చెల్లించేందుకు తమ నుంచి వసూలు చేసిన డబ్బులు బ్యాంకు మిత్ర బ్యాంకులో చెల్లించకపోవడంతో ఇంకా అప్పు ఉంది. కొత్త రుణం ఇవ్వడం కుదరదని మేనేజరు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన మధుశ్రీ, శాంతి, స్వప్న, సత్యసాయి, మేఘన అనే గ్రూపులకు చెందిన సభ్యులు కూడా బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించారు. మొత్తం గ్రూపులకు సంబంధించి దాదాపు రూ.28 లక్షలకు పైగా గ్రామ దీపిక దుర్గారావు డబ్బులు కాజేశాడని తేలడంతో కంగుతిన్నారు. జరిగిన మోసంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా బ్యాంకు అధికారులతో పాటు, వెలుగు ఉద్యోగులు కూడా తమను అడ్డుకున్నారని తెలిపారు. కాజేసిన డబ్బులను తిరిగి చెల్లించే విధంగా వివోతో మాట్లాడతామని చెప్పారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోగా అసలు ఊళ్లోకి బ్యాంకు, వెలుగు ఉద్యోగులు ఎవరూ రాలేదు. ఇప్పటికే ఏడాది కాలంగా వెలుగు సీసీతో పాటు ఏపీఎం కూడా గ్రామంలోకి రాకపోగా డ్వాక్రా మహిళా సంఘాల గురించి అసలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత నెలలో బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ బదిలీ కావడంతో కొత్తగా వొచ్చిన బ్యాంకు మేనేజర్ అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపామని, తప్పని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మొదటి నుంచి బ్యాంకు వాళ్ళు, వెలుగు వాళ్ళు కుమ్మక్కై కూలీనాలి చేసి కూడగట్టుకున్న డబ్బులు కాజేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల రుణాలతో పాటు, సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి రుణాలు మొత్తం కలిపి దాదాపు 30 లక్షల రూపాయలు మేర కాజేసారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో బ్యాంకులో తీసుకున్న అప్పును కష్టపడి తీర్చామనే సంతోషంలో ఉన్నామని, కానీ వీళ్లంతా కలిసి మోసం చేసి, మాయ చేసి ఒక్కసారిగా మాయమయ్యారని గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లకు పైగా బ్యాంకులో తీసుకున్న అప్పు జమ కాకుండా ఉంటే అటు బ్యాంకు ఉద్యోగులు గానీ..వెలుగు ఉద్యోగులు గానీ ఏడాది కాలంగా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత లేకుండా ఎందుకు వీరంతా వ్యవహరించారని మహిళలు నిలదీస్తున్నారు. డబ్బులు వివో కాజేసాడు.. కాబట్టి బాకీ మీరు చెల్లించాల్సిందే అంటూ నోటీసులు జారీ చేస్తూ భయపెట్టడం సమంజసం కాదని స్పష్టం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు చెందిన గిరిజన, దళిత నిరుపేద మహిళలను మోసం చేసిన విషయంపై జిల్లా అధికారులు దృష్టి సారించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు వేడుకుంటున్నారు.