ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌ ‌సమయంలో వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌చేపట్టి ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు అందిస్తూ ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించింది. ఈ సమయంలో నిపుణులైన ఉద్యోగులుకు అద్భుత అవకాశాలు లభించాయి. ప్రాంగణ నియామకాలు ఎక్కువుగా జరిగాయి.ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో  అతలాకుతం అయ్యే పరిస్ధితులు పొంచి ఉన్నాయి.ఈ సంక్షోభం ఒక్క దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు ఐటీ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.దీనికి గల కారణాలు పరిశీలిస్తే నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అధిక ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి.ప్రధానంగా దీనిని అదుపు చేసే ఉద్దేశ్యంతో ద్రవ్య చలామణిని అరికట్టడానికి తొలుత అమెరికా కేంద్ర బ్యాంక్‌  ‌ఫెడ్‌ ‌వడ్డీ రేట్లను పెంచింది. ఇదే బాటలో మిగిలిన  దేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్న సంగతి మనకు విదితమే. మన దేశానికి చెందిన రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కూడా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది.దీనికి తోడు రష్యా ఉక్రెయిన్‌ ‌యుద్ధం కూడా ఆరంభం కావడం వెరసి ఆర్ధిక మాంద్యం ముంచుకు వస్తుందనే భయాలు మరింత పెరిగాయి.అంతే కాదు ఆ సంకేతాలు రోజు రోజుకు ఉదృతమవుతూ వస్తున్నాయి. కోవిడ్‌ ‌విపత్తులో కూడా చెక్కు చెదరకుండా అభివృద్ధి బాటలో కొనసాగిన  ఐటీ రంగంపై ఇది పెను ప్రభావం చూపనుంది.
మున్ముందు ఈ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతం అయ్యే  అవకాశాలు ఉన్నాయని  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికేప్రపంచ వ్యాప్తంగా వీస్తున్న మాంద్యం గాలులు  ఐటీ రంగాన్ని నేరుగా తాకాయి. మారుతున్న ఈ పరిస్ధితులలో మాంద్యం యొక్క తీవ్రత రానున్న 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఐటీ రంగానికి ఎక్కువుగా ఉంటుందని ప్రపంచ దేశాల సీఈఓలు సైతం  హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని టెక్‌ ‌కంపెనీలు ఇప్పటికే దిద్దు బాటు చర్యలు మొదలెట్టాయి.వ్వయ నియంత్రణ కై విభిన్న మార్గాలు అమలుపరుస్తూ కంపెనీల ఉనికిని కాపాడుకోవడానికి సతమతం అవుతున్నాయి.దీనిలో భాగంగా చిన్న ఐటీ కంపెనీలే కాదు బడా కంపెనీలు సైతం  ఉద్యోగులను తొలగించడంలో తమ వ్యూహాలను అమలుపరు స్తున్నాయి.కొత్తగా ప్రాంగణ నియమకాలు తగ్గి పోయాయి.క్యాంపస్‌ ఇం‌టర్వ్యూలలో ఎన్నో వడపోతల మధ్య ఎంపిక చేసిన అభ్యర్థులకుఆఫర్‌ ‌లెటర్‌ ‌వచ్చినప్పటికి ఉద్యోగం లభిస్తుంది అనే నమ్మకం నేడు లేకుండా పోయింది. ఆఫర్‌ ‌లెటర్‌ ‌విషయమై అభ్యర్థులు వివరణ కోరుతూ ఉంటే సమాధానం ఇచ్చే వాళ్ళే కరువయ్యారు.కొన్ని కంపెనీలు అయితే ఆఫర్‌ ‌లెటర్‌ ఇచ్చిన వారికి మీకు వేరొక మంచి అవకాశం వస్తే ఉపయోగించుకోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నాయి.మరి కొన్ని కంపెనీ లు అయితే ఇచ్చిన ఆఫర్‌ ‌లెటర్లు కూడా వెనక్కి తీసుకుంటున్నాయి.హెచ్చు వేతనాలు తీసుకునే నిపుణుల వేతనాలలో సైతం కోతలు మొదలు పెట్టారు. ఉద్యోగులుకు ఇచ్చే వేతనాల పెంపు వాయిదా వేయడం లేదా తక్కువ పెంపుతో సరిపెట్టే చర్యలు ద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి.ప్రమోషన్ల సంగతి సరే సరి.
ఉద్యోగుల భారాన్ని తొలగించుకోవడానికి కొన్ని కంపెనీలు అయితే మూన్‌ ‌లైటింగ్‌ అనేది ఒక సాకుగా చూపించి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.మరి కొన్ని అయితే ఉద్యోగి లో సరైన నైపుణ్య ప్రమాణాలు లేవు అంటూ తీసేస్తున్నాయి.ఐటీ బూమ్‌ ఉన్న సమయంలో ఈ లోపాలు కంపెనీలకు కనిపించలేదు. ఇటువంటి సందర్భంలోనూతన నియామకాలు విషయం పక్కన పెడితే గతంలో ఉన్న ఉద్యోగులకే తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న గ్యారంటీ లేకుండా పోయింది.ఈ సందర్భంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి.మరొక పక్కఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసుకుని ప్రాంగణ నియామకం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి.   ఇవన్నీ చూస్తే ఐటీ రంగంలో సంక్షోభం ఆరంభం అయ్యిందనే చెప్పాలి.ఎందుకంటేఇప్పటికే మాంద్యం ప్రభావం ఐటీపై స్పష్టంగా కనిపిస్తోంది. యాపిల్‌, ‌గూగుల్‌, ‌ఫేస్‌బుక్‌ ‌వంటి దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యోగులను క్రమంగా తగ్గించుకోవడం, తొలగించడం, లే ఆఫ్స్ ఇవ్వడం, కొత్తగా నియామకాలు ఆపడం వంటివి చేస్తున్నాయి. అమెరికాలో అయితే ఈ ముప్పు పేరిట విభిన్న టెక్‌ ‌కంపెనీలు ఇప్పటికే దాదాపు 45 వేల మందిని తొలగించినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో భారత్‌ ఐటీ రంగానికి రానున్నది గడ్డు కాలమే అని చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి అనే నమ్మకం లేకుండా పోయింది.అయితేభారత దేశం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను చూసింది చాలా వాటిని దీటుగా ఎదుర్కొంది. అలాగేప్రస్తుతం అమెరికా, యూరప్‌లలో నెలకొన్న తాజా ఆర్థిక మాంద్యం మన దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం చూపబోదని కొందరు  నిపుణులు చెబుతున్నారు,వీరి ధీమాకు కారణమేమంటేప్రపంచ సాఫ్ట్‌వేర్‌ ‌రంగంలో మన దేశం  కీలక పాత్ర వహిస్తూ ఉంది. విదేశీ ఐటి దిగ్గజాలకు ధీటుగా సమాధానం చెప్పగల కంపెనీలు ఇప్పుడు మన దేశంలోనే ఉన్నాయి. కేవలం గడచిన 20 ఏళ్లలోనే అమెరికా, యూరప్‌ ‌దేశాల ఐటి కంపెనీలకు సరితూగే కంపెనీలు ప్రస్తుతం మన దేశంలో కూడా ఉన్నాయి. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అనేది కొందరి ఆశావాహుల దృక్పధం. అయితే భారతదేశ ఐటి రంగం దేశీయంగా నిర్వహిస్తున్న కార్యకలాపాల కంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల కోసం నిర్వహిస్తున్న కార్యకలాపాలే ఎక్కువ. అంటే మనదేశ ఐటి రంగం దాదాపుగా విదేశీ మార్కెట్లపైనే ఆధారపడి ఉందని అర్థం. భారత ఐటీ రంగం ఇంత బలంగా తయారయ్యేందుకు ప్రధాన కారణం అమెరికా, ఐరోపా దేశాలే. కారణమేమంటేభారత ఐటీ దిగ్గజ కంపెనీలకు పెద్ద ఎత్తున క్లయింట్స్ ఆర్డర్లు ఈ దేశాల నుంచే వస్తాయి కనుగ అక్కడ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకుంటే అది భారత ఐటీ కంపెనీలను కకావికలం చేసే అవకాశ ముంది.అమెరికా ఐరోపా దేశాలకు ఐటీ సేవలు అందిస్తూ విదేశీ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాలతోనే మన ఐటి కంపెనీలు నిలదొక్కుకుంటున్నాయి.
భారత దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ ‌రెవెన్యూల్లో దాదాపు 80 శాతానికిపైగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ ‌మార్కెట్ల నుంచే వస్తుంందంటేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక్కసారి ఆ దేశాల్లో ఐటీ కంపెనీలు దెబ్బతింటే.. అది భారత ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ఎంతగా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు.ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునేదేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. విప్రో కూడా మూన్‌లైటింగ్‌ ‌పేరిట 300 మందిని తొలగించింది. హ్యాపీయెస్ట్ ‌మైండ్స్ అనే ఐటీ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించినట్లు చెప్పుకొచ్చింది. ఇక టెక్‌ ‌మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌ ‌వంటి ఐటీ కంపెనీలే పలువురు ఫ్రెషర్స్‌కు ఆఫర్‌ ‌లెటర్స్ ఇచ్చి మళ్లీ క్యాన్సిల్‌ ‌చేసుకున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.అసెంచర్‌ అయితే తమ ఉద్యోగులలో ఫేక్‌ ‌ధ్రువపత్రాలు పెట్టి కొనసాగుతూ ఉన్నవారిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.గత సంవత్సరం ఆక్టోబర్‌ ‌తో పోలిస్తే ప్రస్తుత సం ఆక్టోబర్‌ ‌నాటికి 18 శాతం నియామకాలు తగ్గాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి.వేతనాల పెంపు విషయంలో కూడా నీలి నీడలు కమ్ముకోవడం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీనిని బట్టి ఇప్పటికే మన ఐటీ రంగంలో సంక్షోభం ఆరంభం అయ్యిందని తెలుస్తూ ఉంది.సరిగ్గా ఇటువంటి పరిణామాలతోనే 2008లో గ్లోబల్‌ ‌ఫైనాన్షియల్‌ ‌క్రైసిస్‌(‌జీఎఫ్‌సీ) వచ్చినపుడు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు మీద పడిన సంగతి మనకు విదితమే. ఈసారి కూడా అదే పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరప్‌లలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత ద్రవ్యోల్బణం ఉండడమే ఇందుకు కారణంగా వారు చెబుతున్నారు.
ప్రస్తుతం మాంద్యం తో పాటు భవిష్యత్‌ ‌లో రాబోయే మరొక ప్రమాదం ఏమిటంటే చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే ఐటీ పరిశోధనలపై తల మునకలు అవుతున్నాయి.ఈ క్రమంలో ఆటొమేషన్‌, ‌రోబోటైజేషన్‌ ‌వైపు ఐటీ రంగం మళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇదేజరిగితే ఏటా ఇంజినీరింగ్‌, ‌డిగ్రీ పట్టాలతో, నైపుణ్య లేమితో బయటికొచ్చే లక్షల మందికి ఐటీ కొలువులు సాధించడం కష్టమవుతుంది. ప్రాంగణ నియామకాలు బాగా తగ్గుతాయి. ఎక్కువ జీతం ఉన్న వారిని తొలగించి తక్కువ జీతానికి పని చేసే వారిచే నియామకాలు జరుపుతాయి.వీటికి తోడు భారత జీడీపీ లో 7.5 శాతంగా ఉన్న ఐటీ సంబంధిత పరిశ్రమలో మాత్రం నేడు ఆందోళన అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఇదే సమయంలోభారత జీడీపీ వృద్ధి రేటును ((GDP Growth Rate) ) కూడా పలు అంతర్జాతీయ సంస్థలు తగ్గిస్తూ వస్తున్నాయి. ఇటీవల వరల్డ్ ‌బ్యాంకు కూడా భారత వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అంతకుముందు దీనిని 8.2 శాతంగా పేర్కొనడం విశేషం. రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా కూడా భారత జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ మాత్రం మరింత కోత విధించింది. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాల్లో కోత కూడా ఐటీ రంగంలో సంక్షోభానికి దారితీసిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కారణాలు వలన టెక్‌ ‌రంగం నేల చూపులు చూడటం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయితే దీని ప్రభావం ఒక సంవత్సరం పాటు ఉంటుందని కొందరు అంటుంటే మరి కొందరు 2 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని చెబుతున్నారు.ఏమైనా ఈ మాంద్యం దీర్ఘకాలంగా కొనసాగే ప్రక్రియ మాత్రం  కాదు.కానీ ఈ స్వల్ప కాలంలోనే ఐటీ వ్యవస్ధపై మాత్రం  దీని ప్రభావం తీవ్రంగా ఉండే  అవకాశమే ఎక్కువుగా ఉందని చెప్పవచ్చు.అయితే ఈ సమయంలో కూడా భారత ఐటీ కంపెనీలకు ఒక ఉపశమనం ఏమిటంటే రూపాయి విలువ పడి పోయి డాలర్‌ ‌విలువ పెరగడం.అయితే అమెరికా ఐరోపా దేశాల మార్కెట్లు సజావుగా లేకపోవడం వలన ఎంత డాలర్‌ ‌విలువ పెరిగినా భారత్‌ ‌టెక్‌ ‌కంపెనీలకు ప్రయోజనం ఉండదు అనేది సుస్పష్టం.ఏది ఏమైనా దీని ప్రభావం మాత్రం చిన్న కంపెనీలపై తీవ్రంగా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం.పెద్ద కంపెనీలకు గతంలో వచ్చిన అర్దర్లు కొంతవరకు వాటిని నిలబెడతాయి.
రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొన్ని కంపెనీలు పొదుపు మంత్రం పాటించడం ఆరంభించాయి.ఐటీ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నైపుణ్యం గల సిబ్బందికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని టెక్‌ ‌నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిపుణుల కొరతను పరిశ్రమ ఎదుర్కొంటు ఉంది.ఈ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారు లేదా వేతనాలలో కోత ఎదుర్కొన్న ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తధ్యం.ఎందుకంటే ఐటీ ఉద్యోగులు తమకు వచ్చే అత్యధిక వేతనాలను దృష్టిలో ఉంచుకుని వేసుకున్న ప్రణాళికలు బ్యాంకులకు చెల్లించే ఈ ఎం ఐ లు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఈ తరుణంలో కంపెనీలు శాశ్వత ఉద్యోగుల స్ధానంలో అవుట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించడం మొదలు పెడతాయి.ఏది ఏమైనా భారత్‌ ‌లో మాత్రం ప్రస్తుతం ఐటీ రంగంలో సంక్షోభం అయితే ఉంది కానీ భయానక పరిస్ధితులు మాత్రం లేవనే చెప్పవచ్చు.ఎందుకంటే భారత్‌ ‌లో కూడా కోవిడ్‌ ‌కాలంలో డిజిటల్‌ ఎకో సిస్టం కొంతవరకూ పెరుగుతూ వచ్చింది.అది ప్రస్తుత సంక్షోభాన్ని కొంత అదిమి పెట్టడంలో సహాయ పడుతుంది అని కొంతమంది టెక్‌ ‌నిపుణులు చేబుతున్నారు.మొత్తానికి ఈ సంక్షోభం అంతానికి అమెరికా ఐరోపా దేశాలు చేపట్టే చర్యలు వలన ఐటీ రంగానికి ఉపశమనం కలుగుతుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.నేల చూపులు చూస్తున్న ఐటీ రంగం త్వరలోనే కోలుకుని ఉజ్వల భవిష్యత్‌ ‌దిశగా ముందుకు పోవాలని ఆశిద్దాం…
image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
లెక్చరర్‌, 9441239578.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page