ట్రిపోలీ, సెప్టెంబర్14 ః లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతం లోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్, సుసాహ్, షాహత్, అల్ బేడా నగరాలలో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇరవై వేల మందికి పైగా ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 90 వేల జనాభా కలిగిన డెర్నా నగరానికి దారితీసే రహదారులన్నీ వరదల కారణంగా దెబ్బతినడంతో సహాయ బృందాలు చేరుకోవడం కష్టమవుతోంది.
రాజకీయ విభజనల కారణంగా 2014లో లిబియా రెండుగా చీలిపోయింది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ట్రిపోలీలో ఉండగా, డెర్నా సహా తూర్పు ప్రాంతం మరో అధికార వ్యవస్థ అధీనంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు సరిగా లేవు. ఆర్థిక అసమానతలు, పర్యావరణ అసమతు ల్యతతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా లిబియాలో నెలకొన్న పాలనాపరమైన సంక్షోభంతో మౌలిక సదుపాయాల కల్పనను గాలికొదిలేయడం.. ఈ ఉత్పాతానికి దారితీసినట్లు తెలుస్తోంది. గడాఫీ ప్రభుత్వం కూలిన తర్వాత అతివాద గ్రూపుల ఆధిపత్యంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల పాలనలో ఉన్న ఈ దేశం అంతర్గత కుమ్ములాటలతో సతమ• •మవుతోంది. అధికారం చలాయిస్తున్నవారు మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టిపెట్టడం లేదు.