మునుగోడు ఎంఎల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టిస్తోంది. ఈ విషయం ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేకుండా ఉన్నది. స్వీయపార్టీపై చేసిన విమర్శలకు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిమీద చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం ఆచీతూచి వ్యవహరిస్తున్నది. పైగా ఆయన్ను ఏదో విధంగా బుజ్జగించి పార్టీలోనే కొనసాగేట్లు చూసేందుకు నానా తంటాలు పడుతున్నది. అందుకోసం దిల్లీ స్థాయి సీనియర్ నాయకుడికి ఈ వ్యవహారాన్ని పార్టీ అప్పగించింది. గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ హల్‌చల్ సృష్టిస్తున్న విషయం తెలియందికాదు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్తా సైలెంట్ అయినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమేకాకుండా సొంత• పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించడం ఆ పార్టీ రాష్ట్ర స్థాయినాయకులకు కొరుకుడు పడకుండా ఉంది. ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా పార్టీ హై కమాండ్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ, హై కమాండ్ ఈ విషయాన్ని నానుస్తూ వొస్తున్నది. అందుకు కారణం సీనియర్ పార్టీ నాయకుడిని కోల్పోవడం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టంలేదు. ఆయన్ను సస్పెండ్ చేసిన వెంటనే, ప్రచారం జరుగుతున్నట్లు ఆయన కాషాయ కండువ కప్పుకోవడానికి మార్గాన్ని సులభతరం చేసినట్లు అవుతుంది. అలా అని ఊరుకుంటే బిజెపిలో చేరిన తర్వాత, లేదా అంతకు ముందే రాజీనామాచేసి కాషాయదళంలో రాజగోపాల్‌రెడ్డి చేరే అవకాశం లేకపోలేదు.
ఈ పరిస్థితిలో కాంగ్రెస్ తర్జనభర్జనకు గురి అవుతుంది. రాజగోపాల్‌రెడ్డి తన పార్టీ మారడమే ఖాయమైతే శాసనసభ్యత్వానికి ఏలాగైనా రాజీనామా చేయడమన్నది తప్పదు. ఎందుకంటే బిజెపికూడా రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని చెబుతున్నట్లు తెలుస్తున్నది. దాంతో కాస్తా వెనుకాముందు ఆయన రాజీనామా చేయడం మాత్రం ఖాయం. ఖాలీ అయిన మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అప్పుడు అనివార్యమవుతుంది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఉప ఎన్నిక జరుగడం అటు కాంగ్రెస్‌కు, ఇటు అధికార టిఆర్‌ఎస్‌కు కూడా ఇష్టంలేదు. కాని, బిజెపి మాత్రం ఈ ఉప ఎన్నిక జరుగాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది. రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇది సెమి ఫైనల్ కావాలన్నది ఆ పార్టీ ఉద్దేశ్యంగా తెలుస్తున్నది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా చూపించిన తడాఖానే ఇక్కడ చూపిస్తామన్న ధీమా ఆ పార్టీకుంది. సారస్వత ఎన్నికలకు ముందు మరో విజయాన్ని తమ ఖాతాలో ఎక్కించుకోవడం ద్వారా గోలకొండపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న తమ లక్ష్యానికి చేరువలో ఉంటామని బిజెపి నాయకత్వం ఆలోచనగా ఉంది. వాస్తవంగా రాజగోపాల్‌రెడ్డిని పోగొట్టుకుంటే అక్కడ కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయం లేదు. నల్లగొండ జిల్లా అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నమాట వినిపిస్తుంది.
దశాబ్దాలుగా అన్నదమ్ములిద్దరే ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం అన్న సైలెంట్‌గా ఉన్నప్పటికీ తమ్ముడి తర్వాత అన్నకూడా అదేదారి పడుతాడేమోనన్న భయం కాంగ్రెస్‌కు లేకపోలేదు. నల్లగొండ ఒక విధంగా కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పుడు ఆ కోట విచ్చిన్నమైతే వారిని ధీటుగా ఎదుర్కోగల ప్రత్యమ్నాయ శక్తిని ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అంత సులభమైన విషయమేమీకాదు. అందుకే బుజ్జగింపు పర్వానికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీ అధిష్టానవర్గం. గతంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూసిన దిగ్విజయ్‌సింగ్‌కు అధిష్టానం ఆ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ వంతు ప్రయత్నం చేశారు. వీరంతో ఇప్పుడు దిల్లీ చేరుకున్నారు. మరోసారి రాజగోపాల్‌రెడ్డితో సంప్రదింపులు జరిపేందుకు ఆయన్ను శనివారం దిల్లీ్ల రావల్సిందిగా కోరారు. రాజగోపాల్‌రెడ్డి దిల్లీ వెళుతారా? ఆయన్ను సంతృప్తిపర్చే హామీని అధిష్టానం ఇవ్వగలుగుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మనం మరో రోజు వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి ఎపిసోడ్ మీద ఒక విధంగా పార్టీ రెండు వర్గాలయింది. కొందరు నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని చెబుతుండగా, మరికొందరు ఇంతకాలం పార్టీ పరంగా అన్ని పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించే ఆలోచన చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటున్నారు. కాగా నిజమైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతున్నదని పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు లాంటి వారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా తమ రాజకీయ భవిష్యత్‌ను చూసుకుంటారని, పార్టీ మారితే రాజకీయంగా లాభ••పడుతానన్న ఉద్దేశ్యం ఆయనకుందని చెబుతున్న విహెచ్ తనకు కూడా అన్యాయం జరుగుతున్నదని, అయినా పార్టీలో ఉండే దాన్ని ఎదిరిస్తానంటున్నాడు. కాగా, మునుగోడులో ఉప ఎన్నికల సంభవిస్తే దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బిజెపి ముందునుండే పథక రచన చేస్తుంటే, ఇప్పటికే రెండు ఉప ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని, మునుగోడును ఎట్టి పరిస్థితిలో బిజెపికి కాకుండా చూడాలని టిఆర్‌ఎస్ పకడ్బందీ ప్రణాళికను రచిస్తున్నట్లు తెలుస్తున్నది.