పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు మొత్తం మీద భారత బృందం ప్రదర్శన మరింత మెరుగుపడిందనే విషయాన్నిసూచిస్తున్నాయి. మన క్రీడాకారుల్లో ఆరుగురు పతకాలు సాధించడమే కాక, మరో 8 మంది విజయానికి వెంట్రుకవాసి దూరంలో నాలుగో స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 15 మంది అథ్లెట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం కూడా భారత్ కు ఇదే తొలిసారి. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ నవోత్తేజంతో కనిపించింది. బృందంలోని 117 మంది సభ్యుల్లో 28 మంది ఖేలో ఇండియా అథ్లెట్లు (కేఐఏ) ఉన్నారు. ఖేలో ఇండియా ద్వారా మొత్తం 2700 మందికి పైగా లబ్ధి పొందారు. వారిలో భారత్ తరఫున పిన్న వయస్కుడైన ఒలింపిక్ పతక విజేత అమన్ సెహ్రావత్, పిస్టొల్ షూటర్ పతక విజేత సరబ్ జోత్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఒలింపిక్ పతక ద్వయ విజేత మను బాకర్ 2018 ఖేలో ఇండియా పాఠశాల క్రీడల మొదటి ఎడిషన్ లో పాల్గొనగా, 2022 ఖేలో ఇండియా విశ్వశిద్యాలయ క్రీడల నుంచి అనేక పతకాలు గెలుచుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో, ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడల్లో ప్రతిభను ప్రోత్సహించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 2018లో ప్రారంభించిన ఈ కార్యక్రమం భారత క్రీడారంగంలో గణనీయమైన పరివర్తన తెచ్చింది. భారత ఒలింపిక్ ఆశావహులకు చేయూతనిచ్చే వ్యవస్థగా ఖేలో ఇండియా సానుకూల ప్రభావం చూపింది. ప్రతిభను గుర్తించి, నిరంతర చేయూతనివ్వడం ద్వారా, అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీనిచ్చేలా క్రీడాకారులను సన్నద్ధులను చేయగల వ్యవస్థను సృష్టించింది. ఫలితాలను ఇప్పటికే చూస్తున్నాం. ఒలింపిక్స్ సహా ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో ఖేలో ఇండియా క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేవలం శిక్షణకే పరిమితం కాకుండా; పోషకాహారం, క్రీడా సామగ్రి, పరికరాలు, అథ్లెట్లకు రూ. 6.28 లక్షల వార్షిక ఉపకార వేతనంతో కూడిన విద్యను అందిస్తూ సమగ్ర విధానాన్ని ఈ కార్యక్రమం అవలంబిస్తోంది. అత్యున్నత క్రీడల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడేలా భారత భవిష్యత్ ఒలింపియన్ లను ఈ కార్యక్రమం సర్వసన్నద్ధులను చేస్తోంది. నిజానికి, పారాలింపిక్స్ లో కూడా మొత్తం 84 మంది పారా అథ్లెట్లలో 25 మంది ఖేలో ఇండియా అథ్లెట్లున్నారు. ఖేలో ఇండియా పథకంలో క్రీడలది కీలక పాత్ర. 2018 నుంచి మొత్తంగా 15 ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించారు. వాటిలో 6 యువజన క్రీడలు, 4 విశ్వవిద్యాలయ స్థాయి క్రీడలు, 4 శీతాకాల క్రీడలు, ఒక పారా క్రీడల పోటీలు ఉన్నాయి. వీటి ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించాం. అంతేకాకుండా, 302 అధీకృత సంస్థలు, వెయ్యికి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు, 32 రాష్ట్ర ఖేలో ఇండియా ఉన్నతి కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలోని మన అథ్లెట్లను భావి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో లోటు లేకుండా భరోసా కల్పిస్తున్నాం. పథకం ప్రారంభ సమయం నుంచి ప్రభుత్వం ఇందులో దాదాపు రూ. 3,616 కోట్లు ఖర్చు పెట్టింది. క్షేత్రస్థాయిలో క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 747 జిల్లాల్లో 1059 ఖేలో ఇండియా కేంద్రాలను (కేఐసీ) ప్రభుత్వం నెలకొల్పింది. స్థానిక ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే క్రీడా నిలయాలుగా ఇవి సేవలందిస్తున్నాయి. భౌగోళిక, ఆర్థిక నేపథ్యాలకు అతీతంగా ప్రతిభ గల ఆటగాళ్లెవరూ మరుగున పడిపోకూడదన్న లక్ష్యంతో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గతంలో చాంపియన్లుగా నిలిచిన అథ్లెట్లకు స్థిరమైన జీవనోపాధిని కూడా ఈ కేంద్రాలు అందిస్తున్నాయి.
అంతేకాక, 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 32 ఖేలో ఇండియా రాష్ట్ర ఉన్నతి కేంద్రాలను (కేఐఎస్ సీఈ) ఈ కార్యక్రమం ద్వారా నెలకొల్పారు. ఈ అధునాతన సదుపాయాలు నిర్దిష్ట క్రీడల్లో ప్రత్యేక శిక్షణను అందిస్తాయి. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, శిక్షణను ఇవి అందుబాటులోకి తెచ్చాయి. ఆ కేంద్రాల్లో సాధన చేసే క్రీడాకారులకు వివిధ క్రీడలకు సంబంధించి సాంకేతిక చేయూతను కూడా ఈ ఉన్నతి కేంద్రాలు అందిస్తాయి. క్రీడా సామగ్రి, ఉన్నత స్థాయి నిర్వాహకులు, శిక్షకుల అందుబాటులో ఇబ్బంది కలక్కుండా చూస్తున్నాయి. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ (కీర్తి) కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడంలో విశేష పురోగతి కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపునకు నోచుకోని క్రీడాకారులను గుర్తించి, వారిలో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. 9-18 ఏళ్ల మధ్య వయస్సున్న పాఠశాల విద్యార్థులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తుంది. ఆధునిక సాంకేతికత, అత్యున్నత పద్ధతులను ఉపయోగించి ప్రతిభావంతులను గుర్తించేలా నిరంతర వ్యవస్థను ఈ కార్యక్రమం నెలకొల్పింది. క్షేత్రస్థాయి ప్రతిభావంతుల గుర్తింపు ప్రక్రియ మొత్తాన్ని ఒకే వేదికపై క్రమబద్ధీకరించడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93 ప్రదేశాల్లో 10 క్రీడా విభాగాల్లో దాదాపు లక్ష మందికి పైగా క్రీడాకారులను వెలుగులోకి తెచ్చారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అస్మిత మహిళా లీగ్ లు నిర్వహిస్తున్నారు.
2021 నుంచి ఇప్పటి వరకు నాలుగు అస్మిత సీజన్లు జరిగాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 క్రీడల్లో మొత్తం 83,615 మంది మహిళలు వాటిలో పాల్గొన్నారు. ఈ లీగ్ ల లక్ష్యం ఛాంపియన్లను అందించడం మాత్రమే కాదు. వారికి క్రీడలపై ప్రేమను పెంచి, కెరీర్ ను సమర్ధంగా తీర్చిదిద్దుకునేలా చేస్తాయి. ఔత్సాహిక క్రీడాకారులకు ఖేలో ఇండియా ఆశాజనకంగా నిలుస్తోంది. ఈ యువ అథ్లెట్లు పరిణతి చెంది, అంచెలంచెలుగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో, మరింత మంది ఖేలో ఇండియా అథ్లెట్లు ఒలింపిక్ ఛాంపియన్లుగా నిలుస్తారని మనం ఆశించవచ్చు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు యువ అథ్లెట్లకు నిర్మాణాత్మకంగా మార్గాన్ని సుగమం చేయడం ద్వారా ఈ కార్యక్రమం భారత క్రీడా భవిష్యత్తుకు మూలాధారంగా నిలిచింది. రేపటి ఒలింపిక్ ఛాంపియన్లను ఇది రూపొందిస్తోంది.
(వ్యాసకర్త కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి)