వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఓటు చాలా అమూల్యమైనదని, దీనిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించుకుని మంచి పాలకులను ఎన్నుకోవాలని అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ సాయి డెంటల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, నవంబర్ మాసం 30వ తేదీన జరగబోవు శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు పాల్గొని నిజాయితీగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగులు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలన్నారు. పోలింగ్ రోజు సెలవు దినమని ఇండ్లకే పరిమితం కాకుండా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, ప్రజల చేత ఎన్నుకొబడే నాయకులు మనల్ని ఐదు సంవత్సరాల పాటు పాలిస్తారని, ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వజ్రాయుధం లాంటి మన ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వడానికి ఈ మాసంతం వరకు అవకాశం ఉన్నందున తప్పనిసరిగా ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారు వెంటనే తమ పేరును ఓటరుగా ఆన్ లైన్ ద్వారా తన పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ఓటు హక్కు పై ప్రసంగం, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు మల్లేశం, కోటాజి లతో పాటు కళాశాల ప్రిన్సిపల్ డా. సంపత్ రెడ్డిలు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.