ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 29: ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలు.. పల్లెలకు బయలుదేరుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన పల్లె వాసులు..సంతూర్లకు ప్రయాణమయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం.. పల్లె పాట పట్టారు. బుధవారం నుంచి ఓటర్లు సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తా విజయవాడ వైపు వెళ్లే బస్టాండు వద్ద ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసింది. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్ కిటకిటలాడుతుంది.
ప్రయాణికుల రద్దీ.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
ఎల్బీనగర్ చౌరస్తా విజయవాడ బస్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీ కారణంగా..వాహనాలు ఎక్కడికి అక్కడికే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల కారణంగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ట్రాఫిక్ పోలీసులు పత్తా లేరు. దీంతో గంటల తరబడి నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడిన.. పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అంటే .. వాహనాలు నిలిపి కేవలం చలానాలే విధించడం.. అన్న ధోరణిలో ఉన్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రైవేట్ వాహనాల చార్జీల పెంపు: ఎన్నికల నేపథ్యంలో ప్రజలు పల్లెబాట పట్టడంతో రద్దీ పెరిగింది. కిక్కిరిసిన బస్సులు, బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో సాధారణ చార్జీల కంటే రెట్టింపు చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా.. అలా అయితే ఎక్కండి లేదంటే లేదని.. భీష్మిస్తున్నారు. డబల్ చార్జీలు పెంపుతో
ప్రయాణికుల పై అదనపు భారం పడుతుంది. దీంతో ప్రయాణికులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.