వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని కళ డాక్టరేట్తో నెరవేరిందని కండ్లపల్లి గ్రామానికి చెందిన మనేందర్ ఆనందం వ్యక్తం చేశారు. పూడూర్ మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎమ్.మనేందర్ కు ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగంలో పీహెచ్డీ ప్రవేశం పొంది ప్రొఫెసర్ సిహెచ్.గోపాల్ రెడ్డి ( మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నల్గొండ) ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. 57 ఎఫ్ఈ మోస్బార్, ఎలక్ట్రికల్ స్టడీస్ ఆఫ్ మాగ్నెటో ఎలక్ట్రిక్ వై – టైప్ కోబాల్ట్ బేస్డ్ ఎగ్జ పెరయిడ్స్ అనే అంశంపై పరిశోధించి సమర్పించిన థిసెస్ కు గాను ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆయన రాసిన పలు పరిశోధన అంశాలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇదే పరిశోధన అంశంపై రొమేనియా, కొలంబియా దేశాలలో ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కండ్లపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించిన ఎమ్.మనేందర్, చిన్నతనం నుండి ఎవరు సాధించలేని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకొని, పరిగి తుంకులగడ్డ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే డాక్టరేట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగా కష్టపడి చదివి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఈ సందర్బంగా ప్రొపెసర్లు తోటి విద్యార్థులు డాక్టర్ ఎమ్.మనేందర్ ను అభినందించారు.