తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న లారీ
ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్ వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్ వాహనంలో 13 మంది వున్నారు. మృతులు తాడిపత్రి, బళ్లారికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఇదిలావుంటే రాయచోటి- వేంప్లలె ప్రధాన రహదారిపై రామాపురం మండలం కుమ్మరప్లలె పంచాయతీ పరిధి సబ్స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు టైరు పగిలి చెట్టుకు ఢీకొంది.
ఈ ఘటనలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమ్మడిశెట్టి మునిస్వామి (59) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలైనట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. రామాపురం వాసి ఉమ్మడిశెట్టి మునిస్వామి నల్లగుట్టప్లలె పంచాయతీ బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. భార్య, కూరుతు, అల్లుడు పిల్లలతో గండి ఆంజనేయస్వామిని దర్శించుకుని కారులో తిరిగి ఇంటికి వస్తుండగా కుమ్మరప్లలె సబ్స్టేషన్ వద్ద కారు టైరు పగిలి చెట్టును ఢీకొంది.
ఈ సంఘటనలో మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలతో ఉన్న లక్ష్మికాంతమ్మ, శ్రావణి, పిల్లలు బావేష్, సూర్యంలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు తోలుతున్న మృతుడి అల్లుడు సత్యనారాయణకు ఎలాంటి గాయాలు లేవు. సంఘటన స్థలానికి రామాపురం పోలీసులు చేసుకుని గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృత దేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. తీవ్రగాయాలతో ఉన్న ఆ నలుగురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు.