కల్మషం లేని భక్తికి భగవంతుడే పరవశించి పోతాడు
పరమ భక్తితో భగవంతుణ్ణే పొందిన ధన్యురాలు గోదాదేవి
భద్రాచలం, ప్రజాతంత్ర , జనవరి 14 : శ్రీ అహోబిలం మఠం వేదికగా శ్రీ గోదా రంగనాథ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు,నృసింహసేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ మనలో కల్మషం లేని భక్తి ఉంటే ముక్తిని ప్రసాదించడానికి ఆ భగవంతుడే దిగివస్తాడని అన్నారు , భగవంతుని పట్టుకోవడం భక్తులకి మాత్రమే సాధ్యమని ఎన్నో లీలలు చూపుతూ ఎవరికీ అందని రూపమే పరమాత్ముడని భగవంతున్ని చేరాలంటే భక్తి మాత్రమే ప్రధానమైనదని అన్నారు , భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పిస్తాడని దాన్ని అందుకున్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. కష్టం వస్తే రోజుకో ధర్మాన్ని రోజుకో భగవంతుడిని మార్చే ఈ సమాజంలో మన జీవితం కొనసాగుతున్నదని భగవంతునిపై ఎంతో భక్తి ఉన్న ప్రహ్లాదుడు కానీ రామదాసు గాని, కొన్ని పరీక్షలను ఎదుర్కొన్న తర్వాతనే మోక్ష ప్రాప్తిని పొందారని, ఎంతో విలువైన బంగారం కూడా అగ్నిలో తనను తాను అర్పణం చేసుకోకుంటే రూపం రాదని అటువంటిది చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి భగవంతున్ని దూరం చేసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. భగవంతుని చేరాలంటే కోట్ల రూపాయలు అవసరం లేదని గుండె నిండా కల్మషం లేని మనసుతో ప్రార్థిస్తే చాలని అన్నారు.హైదరాబాద్ కు చెందిన భక్తులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో భక్తులు నృసింహ సేవా వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు.