డెమోక్రటిక్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు
పోరాడితేనే విజయం దక్కుతుందన్న కమలా
వాషింగ్టన్,జూలై24: అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న అమెరికా ఉపాధ్యక్షురాలు తొలి ప్రసంగం చేశారు. పోరాడితేనే విజయం దక్కుతుందని అన్న ఆమె.. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ దాదాపు ఖరారైనట్లే. పార్టీల మెజార్టీ నేతలు ఆమెకు మద్దతు ప్రకటించడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ పరిణామాల అనంతరం తొలిసారిగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆమె.. దేశ భవిషత్తు కోసం ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని తెలిపారు.
విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో కమలా హారిస్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బిలియనీర్లు, పెద్ద పెద్ద సంస్థల మద్దతుపై ట్రంప్ ఆధారపడుతున్నారు. ప్రచార సహకారం కోసం వారితో బేరసారాలు జరుపుతున్నారు. తన ప్రచారానికి విరాళాలు ఇచ్చిన వారికి చమురు కంపెనీలు ఇస్తామని హా ఇస్తున్నారు. కానీ, మా పార్టీ అలా కాదు. మేం ప్రజాశక్తితో ప్రచారం చేస్తున్నాం. అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే మాకు 24 గంటల్లోనే (హారిస్ అభ్యర్థి అవుతారన్న వార్తల తర్వాత) భారీ ఎత్తున విరాళాలు అందాయి. ప్రజల మద్దతుతోనే అది సాధ్యమైంది.
ప్రజా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా మేం పాలన అందిస్తాం అని కమలా హారిస్ తెలిపారు. ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ మేం అలా జరగనివ్వం. అమెరికన్ల భవిష్యత్తు తరాల కోసం, స్వేచ్ఛ కోసం మేం పోరాడుతాం. అమెరికన్లంతా తుపాకీ హింస భయాలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలి. మాతృత్వపు స్వేచ్ఛను మేం గౌరవిస్తాం. తమ శరీరాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉంటుంది. వారేం చేయాలో చెప్పే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. అబార్షన్లపై నిషేధం విధించాలన్న ట్రంప్ ఆలోచనలను మేం అడ్డుకుంటాం అని హారిస్ అన్నారు. పోరాడినప్పుడే విజయం దక్కుతుంది అని పేర్కొన్నారు.