- హత్యతో అట్టుడికిన పలు ప్రాంతాలు
- బంద్ పిలుపుతో 144 సెక్షన్ అమలు
- ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసుల సూచన
- నిందితులను పట్టుకుంటామని పోలీసుల వెల్లడి
బెంగళూరు, జూలై 27 : బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్ నెత్తారు గత రాత్రి హత్యకు గురికావడంతో కర్నాటకలో తీవ్ర ఉ ద్రిక్తత నెలకొంది. బుధవారం పలుచోట్ల బంద్ నిర్వహించారు. కర్ణాటక వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. దీంతో పలు చోట్ల 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి పౌల్టీ షాప్ నుండి ఇంటికి వస్తున్న ప్రవీణ్‌ను ఆగంతకులు హత్య చేశారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న అతడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆరుగురు పోలీసు బృందాలను ఏర్పాటు చేయగా.. మొత్తంగా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఖండించారు. త్వరితగతిన విచారణ చేపడతామని హానిచ్చారు. కర్నాటకలోని మంగళూరులో మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ మెట్టారు భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలమైన బెల్లరెకి అంతిమయాత్ర నిర్వహించారు. బల్లరె గ్రామంలో ప్రవీణ్ సొంతగా చికెన్ ఫామ్‌ను నడుపుతున్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఆయనను ముగ్గురు అగంతకులు హత్య చేసినట్టు ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి మధుకుమార్ రయన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ రోజువారీ వ్యాపారం ముగించుకుని తన ద్విచక్రవాహనంపై బయలుదేరేందుకు బయటకు వచ్చారనీ, తాను రెయిన్ కోట్ మరిచిపోవడంతో తిరిగి షాపులోకి వెళ్లి వస్తుండగా పెద్దశబ్దం వచ్చిందని మధుకుమార్ చెప్పారు. బయటకు వచ్చి చూడగానే బైక్‌కు 50 అడుగుల దూరంలో ప్రవీణ్ పడి ఉన్నారని, మారణాయుధాలు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పుత్తూరు రోడ్డువైపు పారిపోతుండటం తాను చూశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
మారణాయుధాలతో జరిగిన ఈ దాడిలో ప్రవీణ్ మెడకు బలమైన గాయాలయ్యాయి. తల నుంచి రక్తం ఓడుతుండగా వెంటనే పుత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు దక్షిణ కన్నడ ఎస్పీ రిషీకేశ్ సోనవనె తెలిపారు. బీజేపీ కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారంనాడు సులియా, కడబ, పుత్తూరు తాలూకాల్లో బంద్ పాటించారు. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. కొందరు ఆందోళనకారులు పుత్తూరు తాలూకా బోల్వార్ వద్ద బస్సుపై రాళ్లు రువ్వారు.హిందుత్వ కార్యకర్తలు మంగళవారం రాత్రి ప్రవీణ మృతదేహం ఉంచిన ప్రైవేటు ఆసుపత్రి వద్ద నిరసనలకు దిగారు. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఘటనా స్థలికి రావాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజామున 1.30 గంటలకు ఆయన రావడం, నిందితులను అరెస్టు చేసి, ప్రవీణ్ కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చేలా చూస్తామని హా ఇచ్చారు.
అనంతరం ప్రవీణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు దిగవద్దని, ప్రశాంతంగా ఉండాలని దక్షిణ కన్నడ జిల్లా మంత్రి సునీల్ కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తామని, పోలీసులు అదే పనిపై ఉన్నారని చెప్పారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా సబ్ డివిజన్ పరిథిలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం అర్థరాత్రి వరకూ 144 సెక్షన్‌ను విధిస్తునట్టు పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఎస్ గిరీష్ నందన్ ప్రకటించారు.