దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా నిలిచిన డాక్టర్ కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి లాభం నుండి జీవితమంటే వరకు మొత్తం 34 కవితలు, చివరగా రాళ్లమౌనఘోష అనే దీర్ఘ కవిత ఈ సంకలనంలో ఉన్నాయి. విద్యను నమ్ముకొని జీవించిన ఈ జాతిలో విద్యను అమ్ముకుంటున్న విష సంస్కృతి ప్రబలినప్పుడు చూడలేని కళ్ళుండి ఏమి లాభం అని ప్రశ్నించారు. మానవత్వం మసకబారుతున్నప్పుడు వాస్తవాలు చూడలేని చూపు ఉండి ఏమి లాభమని అన్నారు.
ఇనుప తీగలతో ముగ్గులేసినంత అందంగా నమ్మకాలు వమ్మవుతున్నాయని చెప్పారు. మనసు గుడ్డిదైనప్పుడు మమతల సూత్రం తెగిపోతుందని వేదనపడ్డారు. జనన మరణాల సముద్రంలో అలలా ఎగిసి ఆరిపోతున్న జీవులను, బ్రతుకుల్ని వెలిగించుకోలేని అసమర్థులను చూసి ఆక్రోశించారు. వాస్తవాలను గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకమన్నారు. గౌతమబుద్ధుని కారుణ్య సింధువుల చూపులు మానవ జాతికి ఒక దివిటీగా మలుచుకున్న తీరును వివరించారు. ఎవరూ దరిచేరని క్షణాల్లో నిజాల ముసుగు తొలగి సకల బాధలన్నీ సాపేక్షాలై పునర్నిర్వచించబడుతున్నాయని చెప్పారు. తలపుల దరువులతో నలిగిపోతూ చెప్పలేని బాధతో తడారుతున్న పెదాలతో, మండుతున్న కళ్ళతో మౌనంగా క్షోభను అనుభవిస్తున్నారని అంతరంగ కల్లోలాన్ని వివరించారు.
చేజారుతున్న వయస్సు, ముడతలు పడ్డ మానవత్వం, రాలుతున్న ఆకుల మారుతున్న రంగులను చూసినప్పుడు స్మృతిపధంలో ఆలోచనలు ఎన్నో మెదలుతున్నాయని అన్నారు. మనుషుల మధ్య అవసరాలు మారుతుంటే మనస్సుల మధ్య దూరం పెరుగుతున్నదని చెప్పారు. వంచన తెలియని మంచి వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. మనిషిలో అంతరంగ ప్రపంచం అదృశ్యమై భాష, వేషం మారి వికృతం పెరుగుతున్నదని వేదన చెందారు. ఎన్నో ఆవిష్కరణలకు పురుడు పోసిన మనిషి గుండెల్లో అశాంతి గూడు కట్టడం వెనక విషాదపు అంచులు ఉన్నాయని పేర్కొన్నారు. మనిషితనం మూలాల కోసం రెక్కలు తెగిన ఉపగ్రహాలలో, కాలం చెల్లిన కాలనాళికలో పిచ్చిగా వెతుకుతున్నానంటారు.
అహంకారాన్ని ప్రస్తావిస్తూ చీకట్లో కూడ వెలవెల పోతున్న దీపాలకు ఎందుకింత ఆధిపత్య ముద్ర, హింసాత్మక పరాకాష్ట అని ప్రశ్నించారు. ఓపిక లేని జీవితం, ఓర్పు లేని సహనం, అన్ని తెలుసుననే అహంకారం అంతానికి పునాదిగా మారుతాయని చెప్పారు. అభౌతిక క్షణిక సుఖాలను మోసుకొచ్చే స్వప్నాలకు హద్దులు లేవని అవి నిలిచేవి కావని అన్నారు. జీవితంలో బతుకును వెలిగించుకోలేని అసమర్ధతల పట్ల ఆవేదన చెందారు. జీవించడం మాని బ్రతకడం నేర్చుకొమ్మని హితవు చెప్పారు. నిరాశల్ని తరిమేసి తిరిగి జీవిత మైదానానికి రహదారులు వేసుకోవాలని సూచించారు. ఒక అనిర్వచనీయమైన అనుభూతిని తట్టిలేపుతుందని చెప్పారు. అనునిత్యపు, అనుక్షణపు మానసిక సంక్షోభాల నడుమ జీవన వసంతాల కోసం ఎదురుచూపు తప్పదన్నారు. మాయని గాయాల్ని కప్పుకుంటూ/ గడచిన ఏండ్లను లెక్కిస్తూ/ మరణశయ్యపై / ఎన్నాళ్ళీ చలనము లేని జీవితం అని ప్రశ్నించుకున్నారు.
బ్రతుకు పోరాటంలో ఎందుకీ నిరంతర రణం అని వేదన చెందారు. మరణం అనివార్యమని తెలిసినా నిలకడ లేని ఆలోచనా సముద్రాలపై అంతం లేని ప్రయాణం సాగుతూనే ఉందన్నారు. డిజిటల్ ప్రపంచంలో ప్రేమబంధాలన్నీ నెర్రెలు బారిన గోడలేనని చెప్పారు. దృశ్యాదృశ్యాల సంలీనమై కనిపించని వేదనేదో గుండెను కోస్తున్నదని, మేధోపతనం జరుగుతున్నదని చెప్పారు. మనిషి మనిషిగా బ్రతకలేనప్పుడు ఎంత గొప్ప విజ్ఞానమైనా వివేక రహితమే కదా అన్నారు. ఒక ఆశాకిరణం నిద్రలేని మస్తిష్కపు చీకటి ముసుగులను చీల్చి కాంతి పుంజమై గవాక్షాలను తెరుస్తుందని చెప్పారు. సమిష్టి సుప్తచేతన అంతులేని నైరాశ్యాన్ని మిగిల్చి వెళ్తే గుండె తరక్కుపోయిందన్నారు. విద్యాలయంలో విద్యార్థిది సుదీర్ఘ అనుబంధమని తెలిపారు. అసంపూర్ణ రేఖా చిత్రమైన మనసు గ్యాలరీలోని అనామికను ప్రస్తావించారు.
అన్నదాత మానసిక క్షోభ పోవాలంటే ఉన్నత పాలకులను నిద్రలేపాలన్నారు. అర్థరాత్రి అలసిపోయి మౌన ముద్రతో జోగుతున్న పట్నం రోడ్లను తలపోశారు. అశాస్త్రీయ సంగీత హోరులో కొత్త ఒరవడి కోసం ప్రాకులాటను చెప్పారు. సానబట్టిన మేధస్సుతో కరోనా కీలు విరిసే ప్రతిరోధకాలను సృష్టించే రణకౌశలాలను గురించి తెలిపారు. ఆఖరి మెట్టుపై ఇంకెంత కాలం ఈ పయనం అని ఏ పూటకాపూట భిక్కుభిక్కుమనే జీవితాన్ని గురించి చెప్పారు.స్మృతుల రెక్కలు విచ్చుకోక, పదాల వత్తులను వెలిగించలేక ఎంతో రాయాలని ఉన్నా నిర్లిప్తతా మౌనం వహిస్తున్నానన్నారు. ఇష్టమైన నిశ్శబ్దంతో చెలిమి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. బుసలు కొట్టిన అహం భవబంధాల పంజరాన్ని తెరచి రాగార్తి గీతికలను పాడాలని అన్నారు.
నిజం కాని ఊహలోకంలో వజ్రకీలలై కురుస్తున్న వర్షంలో కలల అలలపై విహరిస్తూ అక్షరాలను ఆలింగం చేసుకొని ఏదో రాయాలని ఉందని తెలిపారు. క్షణాలకు సరికొత్త చైతన్యాన్ని అద్ది ఒక్కోదారపు పోగును పేనుతూ చరిత్రను తిరగరాయాలని ఉంది అంటారు. నిశ్శబ్దాన్ని చీల్చితే శబ్దఘోష, నీరు పాయలైతే భూమి పులకరింత తెలుస్తుందని చెప్పారు. నిత్యజ్వలనమే అవసరమంటారు. ఆశే శ్వాసగా సాగేది, పుట్టుక మరణాల మధ్య సన్నటి గీతగా ఉండేదే జీవితమని నిర్వచించారు. ఈ కవితా సంపుటి చివరలో ఇరవైమూడు పుటల నిడివి కలిగిన రాళ్ళమౌన ఘోష అనే దీర్ఘ కవిత ఉంది. సుదీర్ఘానుభూతులను గతానుగతంగా అందించే సంభాషణాత్మక అనుబంధంగా ఈ దీర్ఘకవిత సాగింది.
కొత్త ధనంతో కూడిన ఊహాశాలిత ప్రయోగమిది. మనిషి నీవు, నేను అని విడిపోతూ వ్యూహాత్మక జీవితాలతో సాగుతూ చివరికి సాంకేతిక వృద్ధితో సృష్టికర్తనే సవాల్ చేసే ఉన్మాద స్థితికి చేరుకున్న తరువాత చివరగా పొందిన అనుభవ సముచ్ఛయాన్ని ఈ కవితలో క్రమానుగతంగా కవి పొందుపరిచారు. ఇదంతా ప్రత్యక్ష సాక్షులై చూసిన రాళ్ళు, శిలలే పాఠకులతో సంభాషిస్తున్నట్టుగా మలిచిన ఈ దీర్ఘకవితా ప్రయోగాన్ని కొత్త ప్రయత్నంగా భావించవచ్చు. విభిన్న సామాజిక అంశాల సంలీనతను సమగ్రంగా విశ్లేషించిన మీదట వెలువడిన కవిత్వమిది.
– తిరునగరి శ్రీనివాస్, 8466053933