హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే అవార్డు 2023 గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. ప్రతి యేటా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జయరాజ్‌ను ఎంపిక చేస్త నిర్ణయం తీసుకున్నారు. ఈ అవార్డు కింద రూ.1,01,116 ల నగదు రివార్డుతోపాటు జ్ఞాపికను అందించి శాలువాతో సత్కరించనున్నారు. నాటి ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాద్ జిల్లాకు చెందిన జయరాజ్(60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టనషాలను అధిగమించి కవిగా పేరుతెచ్చుకున్నారు.
పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమసమాజం కోసం తన సాహిత్యంతో అహరహం కృషి చేశారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో ఆయన స్ఫూర్తి పొందారు. ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ…తన ఆటపాటలతో ఆయన సాంస్కృతిక ఉద్యమ భావాజాలాన్ని రగిలించి ప్రజాకవిగా జయరాజు తన వంతు పాత్ర పోషించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన రాసిన పాటలు బహుళ ప్రాచుర్యం పింది ప్రజల్లో స్ఫూర్తిని నింపాయి. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు ఆయన రాసిన పుస్తకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.