కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి సారించడం లేదు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసే చర్యలపై మోడీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. కార్పోరేట్లకు అండగా నిలవడం తప్ప ప్రజలకు అండగా ఉండే చర్యలు కానరావడం లేదు. ప్రజలను కష్టాల కొలిమిలోంచి బయటపడేసే చర్యలు కానరావడం లేదు. భారతదేశంలో కొరోనా  వ్యాప్తి, మరణాల సంఖ్య కారణంగా ప్రజల ఆర్థికస్థితి చితికిపోయింది. పేదలు మరింత పేదలుగా మారారు. అలాగే మధ్య తరగతి ప్రజలు మరింతగా దెబ్బతిన్నారు. ఈ క్రమంలో కొరోనా  దెబ్బనుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే మెల్లగా బయటకు వస్తున్నారు.

ఫోర్త్‌వేవ్‌ ‌హెచ్చరికలు వస్తున్నా ..సాధారణ కార్యకలాపాలు సాగుతు న్నాయి. ఎవరికి వారు పొట్టకూటి కోసం పనులకు వెళుతున్నారు. కాయకష్టం చేసుకునే వారికి ధోకా  లేకున్నా ఉపాధి, ఉద్యోగ రంగాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. దెబ్బతిన్న రంగాలను గుర్తించి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. దెబ్బతిన్న ప్రజలను,రంగాలను గుర్తించి నేరుగా వారిని ఆదుకోవడంలో విఫలం అవుతున్నాయి. ప్రధానంగా లోయర్‌ ‌మిడిల్‌ ‌క్లాస్‌ ‌వాళ్లు బాగా దెబ్బతిన్నారు. ఉద్యోగాలు పోయాయి. ఉపాధి దొరకడం లేదు. ఈ వర్గాలను గుర్తించి వారిని నేరుగా ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలి. గతంలో ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ ఎవరికి మేలు చేసిందో తెలియదు. పోనీ ఎవరైనా గట్టిగా మాకు ఈ మేలు జరిగిందని చెప్పడం లేదు. నిజానికి సర్వే జరిపించి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారిని గుర్తించి నేరుగా నగదు బదిలీ పథకం లాంటి చేపడితేనే ప్రజలు మళ్లీ నిలదొక్కుగోలరు. అలాగే బ్యాంకులు ఉదారంగా తక్కు వడ్డీలకు రుణాలు ఇచ్చేలా చూడాలి.

చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారికి కనీసం కోటి వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వగల గాలి. అప్పుడే గ్రాణ ఆర్థికరంగం బలోపేతం అవుతుంది.  కొరోనాతో హాస్పిటల్స్ ‌కు దోచిపెట్టి, బంధువు లను, అయినవాళ్లను కోల్పోయిన వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారన్నది ముఖ్యం. కొరోనా రెండో వేవ్‌లో ఆక్సిజన్‌ ‌సంక్షోభంతో వైద్యరంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. త్వరలో మూడో వేవ్‌ ‌వచ్చే అవకాశం ఉందనే అంచనాలూ వెలువడు తున్నాయి. కొవిడ్‌ ‌హాస్పిటల్స్ , అం‌బు లెన్సులు, మందులు, ఐసీయూ, ఆక్సిజన్‌ ‌పడకలను పెంచడానికి వెచ్చిస్తామని చెప్పినా ఇప్పుడు ఫోర్త్ ‌వేవ్‌ ‌వస్తున్న క్రమంలో ఎలాంటి ఆరోగ్య సేవలు అందుతాయో తెలియదు. కొవిడ్‌తో కుదేలైన మరో రంగం పర్యాటకం. హాస్పిటల్స్ , ‌నర్సింగ్‌ ‌హోంలు, క్లినిక్‌లు, మెడికల్‌ ‌కాలేజీలు ఆక్సిజన్‌ ‌ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి తగువిధంగా నిధులు కేటాయించాలి. అయితే ఆత్మనిర్భర భారత్‌తో పాటు ఇప్పటికే  ప్రకటించిన ప్యాకేజీలు ఏవీ కూడా సామాన్యులకు దోహదపడవని అర్థం అవుతోంది.

సామాన్యులకు మేలు చేసేలా పథకరచన సాగడం లేదు. వ్యక్తులు లేదా కుటంబాలను ఆదుకోవడానికి ఏదో రకమైన వెసలుబాటు ఉండాలి. ఎవిరికి వారు కోలుకోవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. మరోవైపు ఫోర్త్‌వేవ్‌ ‌హెచ్చరికలు భయం గొల్పుతున్నాయి. ఇప్పటికే హాస్పిటల్స్  ‌ల్లో వైద్యం సరిగా చేయడం లేదన్న విమర్శలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.కొరోనాకు అవసర మైన చికిత్స చేస్తున్నామని అంటున్నా హాస్పిటల్స్  ‌తీరు అధ్వాన్నం అంటూ విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. కొరోనా విషయంలో కేవలం ప్రాణభయం మాత్రమే కాదు, ఆర్థిక భయం కూడా మధ్యతరగతి వారిని వేధిస్తున్నది. రోగనిరోధక శక్తిని పెంచే దిశగా ప్రజలు ఎవరికి వారు చర్యలు తీసుకుంటున్న వేళ అవి కూడా భారంగా మారాయి. దేశీయంగా ఉన్న ఆయుర్వేదాన్ని బలోపేతం చేసి, ఔషధాలన్ని పరిశీలించి ప్రయోగించేందుకు కేంద్రం ముందుకు రావాలి. ఈ కష్టాల కొలిమిలోంచి ప్రజలు బయటపడేందుకు వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చాలి. అప్పుడు దేశీయ ఆర్థికరంగం బలోపేతం కాగలదు. బ్యాంకులను అందుకు సన్నద్దం చేయాలి. కొరోనా ను, జాగ్రత్తలను జనం దాదాపుగా మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్న స్థితిలో ఇప్పుడు మళ్ళీ మాస్కులూ, దూరాల వంటి నిబంధనలను కఠినంగా అమలులోకి తేవలసి వస్తున్నది.

విమాన ప్రయాణీకులకు మాస్క్ ‌తప్పనిసరిచేస్తూ, ప్రయాణం అంతా దానిని ధరించాల్సిందేనని డిజిసీఎ ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ళ తరువాత చాలా రాష్టాల్ల్రో స్కూళ్ళను ధైర్యంగా తెరిచారు. ఈ తరుణంలో ఒక్కసారిగా కేసులు పెరగడం పెద్ద సవాలే. కొరోనా కారణంగా విద్యార్థులు ఎంతోకాలంగా తరగతి గదుల్లో ప్రత్యక్షంగా కూచొని చదువుకొనే, మిత్రులతో కలసి ఆడుతూపాడుతూ గడపగలిగే అవకా శాన్ని కోల్పోవలసివచ్చింది. ఆన్‌ ‌లైన్‌ ‌చదువులన్నవి ఎక్కువమందికి ఎక్కలేదనీ, అందరికీ అందలేదని కూడా తేలిపోయింది. మాస్కులు, దూరాలు, పరిశుభ్రతలకు కట్టుబడుతూ బడులను ధైర్యంగా నడపగలిగే అవకాశం ఈ మారు ఏ మేరకు ఉన్నదీ కొద్దిరోజుల్లోనే బహుశా తేలిపోవచ్చు. న్యాయస్థానాల్లో దబాయించడం ద్వారానో, అంతర్జాతీయ సంస్థలను హెచ్చరించడం ద్వారానో కొరోనా లెక్కలను కప్పిపెట్టవచ్చు నేమో కానీ, పరిస్థితి తీవ్రత ప్రజలకు అర్థంకాకుండా పోదు. అసత్యాలు, అర్థసత్యాలతో ఎప్పటికప్పుడు నెట్టుకురావడం కాక, ప్రజల మనసుల్లో రక్షకులుగా చిరస్థాయిగా నిలిచి పోయేందుకు పాలకులు కృషి చేయాలి. అలాగే ఆర్థికంగా అతిపెద్ద చర్యలకు ఉపక్రమించాలి. ప్రధానంగా ఉపాధిరంగాలను విపరీతంగా ప్రోత్సహించాలి. ప్రజలకు అవసరమైతే వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. చిన్నాచితకా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనతవరకు దేశ అర్థికస్థితి కుదుటపడదని గుర్తించాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page