- 2000 మంది నిరుద్యోగులతో రాహుల్ భేటీ
- 36వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర
బెంగళూరు, అక్టోబర్ 12 : కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా 36వ రోజు బుధవారం కర్ణాటక నలుమూలల నుంచి వొచ్చిన 2000 మంది నిరుద్యోగ యువకులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారితో పరస్పరం అభిప్రాయలను పంచుకున్నారు. ఈసందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని, వారికి ఉపాధి కల్పించే వ్యూహలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
వారు ఎదుర్కుంటున్న సమస్యలను గొంతెత్తి చాటడానికి వారికి రాహుల్ 5 ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. బుధవారం కర్ణాటకలోని చిత్రదుర్గలోని చల్లకెరె పట్టణం నుంచి యాత్ర ఉదయం సెషన్‌ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ ఇది ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న యాత్ర కాదని, అయితే రాజకీయ యాత్ర..జనచైతన్యం, జన సమీకరణ కోసం యాత్ర అని అన్నారు. జైరాం రమేష్ అన్నారు.
కాగా ఎప్పటి మాదిరిగానే రాహుల్ వెంట వేలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొనగా ఉత్సాహంగా ముందుకు కొనసాగింది. కర్నాటక పిసిసి చీఫ్ శివకుమార్ కూడా పాల్గొన్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన కొంత మంది ట్రాన్స్‌జెండర్లు వారి కష్ట సుఖాలను రాహుల్‌తో పంచుకుంటూ పాద యాత్రలో పాల్గొనడం విశేష ఆకర్షణగా కనబడంది. కొంత మంది యాత్రలో భద్రతా వలయాన్ని కూడా అధిగమించి రాహుల్‌తో చేతులు కలపడానికి ప్రజలు ప్రయత్నించడం వంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి.