పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 15: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం ఆశోక్ నగర్ లోనీ తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. గత ఐదేళ్లక్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆనాడు, ఈనాడు నాకు మోసం జరిగిందన్నారు. ఏఐసీసీ పెద్దలు మమ్మల్ని పలకరించారు కానీ, ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు. తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని గాలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ మండల మైనారిటీ ప్రెసిడెంట్ అజమాత్ అలీ, నాయకులు నర్సింగ్ రావు, అన్వార్, హఫీజ్, సౌకత్, సమీ, ఫయాజ్, అబ్బాస్, మాసమ్, జూబ్బాయిర్, తన్వీర్ అఫ్రోజ్, నరేష్, ఉగ్గే శ్రీనివాస్, ఆవుల రమేష్ , ఆకుల యాదయ్య , బత్తుల రాములు, నాయికోటి వెంకటేష్, రామిని సందీప్, తదితరులు పాల్గొన్నారు.