- మేడారం నుంచి ప్రారంభం
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో బీఆరెఎస్, బిజేపిల బంధం తెలిసిపోయింది
- డియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ములుగు నియోజకవర్గం పరిధిలోని సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచి ఫిబ్రవరి 6న ‘హాత్ సే..హాత్ జోడో’ యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘మేడారంలో ఈ నెల 6న మొదలయ్యే యాత్ర నుంచి 22, 23 తేదీల వరకు కొనసాగుతుంది. ఇందులో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలో సాగే యాత్రలో స్వయంగా నేను పాల్గొంటా. నాతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి చేరవేస్తారు’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24, 25, 26 ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్‌లో జరుగుతాయి.
ఈ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఇతర ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉంటుంది. అందువల్ల ఆ మూడు రోజులు యాత్రకు విరామం ఉంటుందని తెలిపారు. తర్వాత యాత్ర యాథావిధిగా కొనసాగుతుంది. కొత్త నియామకాలు చేసేవరకు పాత మండల అధ్యక్షుల ఆధ్వర్యంలోనే హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాలు సాగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1999-2004 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హాయాంలో వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సంక్షోభం ఏర్పడింది. సంక్షేమ పథకాలు అమలుకాక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆ పరిస్థితులకు చలించి ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు. పాదయాత్ర కలిసొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనార్టీలకు రిజర్వేషన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2003 పరిస్థితులే 2023లో దాపురించాయి.
విద్యుత్ రంగంలో సంక్షోభం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, రుణ మాఫీ కాలేదు. 2014 నుంచి 2017 వరకు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో, 2017 నుంచి ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. అమరుల కుటుంబాలు అనాథలుగా మారాయి. పోడు భూమలు, అసైన్డ్ భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ధరణితో విపరీతమైన సమస్యలు వొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి వారికి విశ్వాసం కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కోవిడ్ సమయంలో సీతక్క పేద ప్రజల కోసం ఎంతో కష్డడింది. అందుకే సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలోని మేడారం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నామని రేవంత్ తెలిపారు. రాజులు, రాచరికం మీద గిరిజన హక్కుల కోసం సమ్మక్క సారక్క రక్తం చిందించారు. అదే స్ఫూర్తితో దొరల మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ, బీఆరెస్..రెండు ఒకే తానులోని ముక్కలు
బీజేపీ, బీఆరెస్ రెండు ఒకే తానులోని ముక్కలు. ఎనిమిది సంవత్సరాలు వారిద్దరూ అన్ని అంశాల్లో కలిసి పని చేశారు. వీరిద్దరిపై వ్యతిరేకత ఏర్పడి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వ్యూహాత్మాకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలకు తెర లేపారు. ఇందుకు రాజ్ భవన్, ప్రగతి భవన్లను వేదికలుగా వాడుకున్నారు. నిన్నటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో వారి నాటకం బట్టబయలైంది. విద్యుత్, ఆరోగ్యం, మిషన్ భగీరథ అంశాల్లో గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారు. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లిచ్చారు? కనీసం కీలక మంత్రుల సొంత గ్రామాల్లోనైనా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా?
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత గ్రామంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా? కేసీఆర్ చింతమడకలో ఇచ్చారా? హరీష్ సొంత ఊరిలో ఇచ్చారా? పచ్చి అబద్ధాలు చెప్పి గవర్నర్ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. గవర్నర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి కేసీఆర్ అబద్ధాలను కప్పి పుచ్చారు. మేం ముందు నుంచి చెబుతున్నట్టుగానే బీజేపీ, బీఆరెస్ రెండూ ఒక్కటే. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయట పడాలి. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. కేటీఆర్‌కు క్యాట్ వాక్, డిస్కో డాన్స్, పబ్‌ల గురించి మాత్రమే తెలుసు. దేశ సమగ్రత గురించి మాట్లాడేంత అవగాహన కేటీఆర్‌కు లేదు. రాహుల్ గాంధీని విమర్శించేంత స్థాయి కేటీఆర్‌కు లేదు. తండ్రీ, కొడుకులకు రాజకీయ ప్రయోజనాల ముఖ్యం. కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాలు ముఖ్యం..అని రేవంత్ రెడ్డి అన్నారు.