కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 13: యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది ఏళ్లు అవుతున్న ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయ లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు, ఇంటికో ఉద్యోగం, గృహ లక్ష్మి పథకం, కేజీ టూ పీజీ విద్యా వంటివి అమలు చేయకపోగా, తొమ్మిది ఏళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బందు, బిసి బందు పేరుతో మెజార్టీ ప్రజలను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నులు, మంచి నీటి బిల్లులు ధనవంతులు ఉండే బంజారా హిల్స్ లో కూడా లేవని అన్నారు. ఇక్కడి ప్రజలు ఏమి పాపం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైద్రాబాద్ సమీపంలోని శివారు ప్రాంతాలను అడ్డగోలుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం అయ్యారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వేల కోట్ల నిధులను ఇస్తున్న, వాటిని తీసుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కనాడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు ఇస్తున్నట్లు చెప్పకపోవడం దారుణమని అన్నారు. జిహెచ్ఎంసిలో కార్పొరేటర్ల స్థాయిని తగ్గించడానికే , వార్డు కార్యాలయాలు ఓపెన్ చేశారని అన్నారు. బీజేపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో గెలవడం వలనే, ఈ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. కేసీఆర్ రైతు బందు ఒక్కటి ఇచ్చి, అనేక సబ్సిడీలను ఎత్తి వేసి, రైతులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ యోజన పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేల నగదు అందిస్తూ.. రైతులు అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజనతో పాటు యంత్రాలు, ఎరువులపై కలిపి రైతులకు ఏడాదికి దాదాపు రూ.26 వేల వరకు లాభం చేకూరుస్తున్నట్లు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్తు ఇస్తే, సరిపోతుందని అనడంలో ఏమాత్రం ఆచర్యం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో బయటపడిందన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయాలని చుస్తుందన్నారు. రాష్ట్రంలో బిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరని, తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు రామిడి మహేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page