మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, తెలంగాణ అందకారం కావడం ఖాయమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న బి అర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ పాత గ్రామంలో సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి, ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఆనాడు విద్యుత్ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, రాష్టం అంధకారం కావడం ఖాయమన్నారు. సమాఖ్య రాష్టంలో ఇరిగేషన్ పూర్తిగా నిరాదరణకు గురైతే, నేడు మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. రైతు బంధు, రైతు బీమా, ధాన్యం మద్దతు ధరతో రైతుల కళ్ళలో ఆనందం కనబడుతుందన్నారు. కేసీఆర్ దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, ఆసరా పింఛన్లు, వంటి పథకాలను ఇచ్చి, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వేస్తే, ఈ పథకాలు ఇస్తారన్న నమ్మకం లేదు. ఇచ్చే వారిని నమ్మి ఓట్లు వేయలిగా, మేము వస్తే ఇస్తామని చెప్పే మాటలు నమ్మకూడదన్నారు. ఒక్కప్పుడు మీర్ పేట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. గత ఐదు ఏళ్లలో నేను చేసిన అభివృద్ధిని ఒక్కసారి చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.