కిరాయి యుద్ధం

“మధ్యాసియా దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రష్యా కోసం ఉక్రెయిన్‌ ‌లో విధ్వంసం చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ అద్దె సైనికులు గతంలో ఐసీస్‌పై పోరాటం చేసిన సిరియా ఫైటర్స్. ‌పుతిన్‌ ‌కు, ఈ అద్దె ఫైటర్స్ ‌కు చాలా కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2015లో సిరియాకు మద్దతుగా రష్యా యుద్ధ క్షేత్రంలోకి సహకారం అందించింది.”

pendrive rehanaచూస్తుండగానే 20 రో జులు గడిచి పోయాయి. ఉక్రెయిన్‌ ‌గడ్డ పై వేలాది మంది బాంబులకు, తూటాలకు బలయ్యారు. లక్షలాది మంది ఉక్రెయిన్లు శరణార్ధులుగా మారి కట్టుబట్టలతో దేశ సరిహద్దులు దాటారు. ఇంకా లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అయిన వాళ్లు ఎటు వెళ్ళారో జాడ తెలియక అల్లాడుతున్న వారు మరికొందరు. అటు ఉక్రెయిన్‌ ఇటు రష్యా ఆర్ధిక పరిస్థితి పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రపంచం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న అనుమానాలు లేకపోలేదు. అయినా రష్యా అధినేత పుతిన్‌ ‌కీవ్‌, ‌మరియాపోల్‌ ‌వంటి పట్టణాలే టార్గెట్‌ ‌గా విధ్వంసం కొనసాగిస్తున్నారు. ఇందులోనే మరో ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సుపారి సైన్యం
మనం సినిమాల్లో, నేర వార్తల్లో చూస్తుంటాం సుపారీ తీసుకుని హత్యలకు పాల్పడే నేరగాళ్ళ గురించి. చంపేవారికి హతుడితో ఎలాంటి పంచాయతీ ఉండదు. కక్షలు, కార్పణ్యాలు కాదు కదా కనీసం ముఖపరిచయం కూడా ఉండక పోవచ్చు. అయినా అద్దెకు కారు తిప్పినట్లు కేవలం డబ్బుల కోసం ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారు. సరిగ్గా ఇదే విధానం అంతార్జాతీయ యుద్ధ క్షేత్రాల్లో కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఏజెన్సీలు కూడా ఉంటాయి. ఉక్రెయిన్‌ ‌పై ఆధిపత్యం కోసం రష్యా తన సైనికులను మాత్రమే కాకుండా అద్దెకు కూడా సైన్యాన్ని దింపుతోంది. యుద్ధం, దాడుల్లో శిక్షణ పొంది ఉండే సైనికులు ఇచ్చిన టార్గెట్‌ ‌ను పూర్తి చేసుకుని రావటంలో నిష్ణాతులు అయి ఉంటారు. ఇలా సుపారి సైనికులను ప్రయోగించటం నైతికమా, అనైతికమా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారు ఎవరూ ఉండరు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని పుతిన్‌ ‌రహస్యంగానూ ఉంచాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఉన్నారు.

మధ్యాసియా దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రష్యా కోసం ఉక్రెయిన్‌ ‌లో విధ్వంసం చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ అద్దె సైనికులు గతంలో ఐసీస్‌పై పోరాటం చేసిన సిరియా ఫైటర్స్. ‌పుతిన్‌ ‌కు, ఈ అద్దె ఫైటర్స్ ‌కు చాలా కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2015లో సిరియాకు మద్దతుగా రష్యా యుద్ధ క్షేత్రంలోకి సహకారం అందించింది. రష్యా తరఫున బషర్‌ అల్‌ అసద్‌కు కోసం ఈ కిరాయి సైన్యం పోరాడింది. అంతకు ముందు 2014 నుంచి ఉక్రెయిన్‌, ‌రష్యా సరిహద్దున ఉండే డోన్‌బాస్‌లోనూ పని చేస్తోందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ డోన్‌ ‌బాస్‌ ‌ప్రాంతం ప్రస్తుత దాడిలో రష్యాకు కీలక స్థావరంగా మారింది. అసలు ప్రైవేటు మిలిటరీని సేవలు అందిస్తున్న వాగ్నర్‌ ‌గ్రూప్‌ ‌నిర్వహకుడు పుతిన్‌ ‌కు సన్నిహితుడు అంటారు. కిరాయి సైన్యం కనుక అడ్డూ అదుపు లేకుండా రక్తపాతం సృష్టించే అవకాశం ఉంటుంది. అంతకంటే కీలకమైంది ఏంటంటే ఈ సైన్యానికి చేసే చెల్లింపులకు లెక్కాపత్రం ఉండదు. కాంట్రాక్ట్ ఎవరో, చెల్లింపులు ఏ రూపంలో ఎంత మొత్తంలో చేశారో రహస్యంగా ఉంటుంది. కీలకమైన ఆపరేషన్స్ ‌లో మూడో కంటికి తెలియకుండా పాల్గొంటారు కనుక కిరాయి ఫైటర్లకు ఇచ్చే చెల్లింపులు భారీ ఎత్తున ఉంటాయి.

మూడు యుద్ధాలు-ఆరు ఒప్పందాలు
ఇలా అద్దెకు సైనిక సేవలు అందించే ఫైటర్ల వ్యవస్థ చాలా కాలం నుంచే ఉంది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో మరింత వేళ్లూనుకుంటున్నట్లు అంతర్జాతీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దశాబ్దాల కిందటే ప్రైవేటు మిలటరీ వ్యవస్థ అస్థిత్వం పలు దేశాల ఘర్షణలను విశ్లేషిస్తే అర్థం అవుతుంది. అయితే మొదటి సారి 2007లో బ్లాక్‌వాటర్స్ అనే సంస్థకు చెందిన వ్యక్తులు ఇరాక్‌ ‌రాజధాని బాగ్దాద్‌లో 14 మందిని కాల్చి చంపటంతో అద్దె సైన్యం వ్యవస్థ గురించి చర్చ బయటకు వచ్చింది. ఇరాక్‌ ‌యుద్ధం పతాక దశలో ఉన్నప్పుడు ఇటువంటి కిరాయి ఫైటర్లు దాదాపు పదివేల మంది వరకు పని చేశారని ఒక అంచనా. వీరు కేవలం హత్యాకాండ, అటాకింగ్‌ ‌లోనే కాకుండా తమతో ఒప్పందం చేసుకున్న దేశ సైన్యం కాన్వాయ్‌ ‌రక్షణ, ఆహారం, ఆయుధాల సరఫరా, ఉండటానికి టెంట్ల ఏర్పాటు వంటివి ఇతర సపోర్టింగ్‌ ‌సేవలు కూడా అందిస్తారు. 1990 దశకం ప్రారంభంలో యుగొస్లేవియా దేశం నుంచి బోస్నియా, క్రొయెషియా దేశాలు విడిపోయాయి.

ఆ సమయంలో ఈ రెండు దేశాల దళాలకు సహాయం చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి కొన్ని ప్రైవేటు సైనిక ఏజెన్సీలు ఒప్పందం చేసుకున్నాయి అంటారు. ప్రైవేటు సైనిక ఏజెన్సీలు అంత బలమైనవా అన్న అనుమానం రావచ్చు. అప్పట్లోనూ అగ్రరాజ్యం అమెరికా సహకారంతో ఈ వ్యవహారం అంతా జరిగింది. కిరాయి సైన్యం వాటి విస్తరణ జరుగుతున్న తీరు పై ఏరో స్పేస్‌ అం‌డ్‌ ‌డిఫెన్స్ ‌న్యూస్‌ అధ్యయనం చేసి నివేదిక బయటపెట్టింది. ఈ నివేదిక నివేదిక ప్రకారం 2020లో గ్లోబల్‌ ‌ప్రైవేట్‌ ‌సెక్యూరిటీ, సైన్యం పరిశ్రమ విలువ సుమారుగా 10 లక్షల కోట్లు. వచ్చే 8 ఏళ్లలో అంటే 2030 నాటికి దీని విలువ రెండింతలు కానుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇది స్థూలంగా కనిపించే చిత్రం అయినా …మనం ఒక విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రైవేట్‌ ‌ఫైటర్ల వ్యవస్థను ఏర్పాటు చేయటంలో పొరుగు దేశంపైనో లేదంటే ప్రపంచం పైనో ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాల పాత్ర ఉంటుంది. అంతిమంగా నష్టపోయేది మాత్రం బలహీన దేశాలే. ఒక సిరియా, ఒక అఫ్ఘనిస్థాన్‌, ఒక లిబియా ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చరిత్రలో సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page