వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వొచ్చాయి
నీ అవినీతికి ఇప్పటికే ఊచలు లెక్కబెట్టాల్సింది
అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవర్టు
మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని, వారి అవినీతి చిట్టా మొత్తం తనకు తెలుసని, తన జోలికి వొస్తే వారి చిట్టా విప్పుతానని, కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న తాము కోవర్టులమా అని, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్ కేటీఆర్? అంటూ కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రి కెటిఆర్‌పై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంగళవారం మంత్రి కెటిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సారథి.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ తనను కోవర్ట్ అనటానికి కేటీఆర్‌కు సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్‌కు కలిసి వొచ్చేనా !
పట్టుమని పది ఎకరాలు లేని కేటీఆర్‌కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వొచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ దిల్లీకి కోవర్టువు కాదని..వొట్టేసి చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవర్టు అని ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాకుంటే ఎప్పుడో జైల్లో ఊచలు లెక్కబెట్టేవారని కోమటిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ లోనూ కల్వకుంట్ల ఫ్యామిలీకి కమీషన్లు వెళ్తున్నమాట నిజం కాదా అని ప్రశ్నించారు. తాను నిజాయితీతో నిప్పులా జీవిస్తున్నానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..కేసీఆర్ కుటుంబంలా కమీషన్లతో బతకడం లేదన్నారు. రాజకీయమంటే….అప్పనంగా అధికారం అనుభవిస్తూ వేల కోట్ల అవినీతి చేయడం కాదన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే ..విదేశీ పర్యటనల్లో కేటీఆర్ ఎంజాయ్ చేయడం సమంజసం కాదన్నారు. కేటీఆర్ భాష, పద్ధతి బాగాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చదివింది అమెరికాలోనా..! గుంటూరు గల్లీల్లోనా..? అంటూ ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఎలా వొచ్చిందో కేటీఆర్‌కు తెలుసా అని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రిగా ఉన్నతమైన హోదాను.. గడ్డిపోచలా వదిలేశానని చెప్పారు. తాను చేపట్టిన ఉద్యమం ఉప్పెనై రగిలితే.. తెలంగాణ వచ్చిందనే విషయం తెలియకుంటే కేటీఆర్ అడిగి తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న నన్ను.. కోవర్ట్ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా? కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం. సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలో నేను ప్రచారానికి వెళ్లడం లేదు. నేను ప్రచారానికి వెళ్లకపోతే నీకేంటి? విదేశాలకు వెళ్తే నీకేంటి? కేటీఆర్ నువ్వు విదేశాలకు వెళ్లి ఏం చేశావో నాకు తెలుసు. నువ్వెందుకు విదేశాలకు వెళ్లావని నేను అడిగానా? తడిచర్లలో రూ. 10వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా? సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి.. మునుగోడులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.